పర్యాటకులను కట్టిపడేస్తున్న ‘పుష్ప బ్రిడ్జ్’! మోతుగూడెం అందాలకు ఫిదా అవుతున్న సందర్శకులు!

by Ramesh Naini |

దట్టమైన అడవులు, చుట్టూ పచ్చదనం, మనసును దోచే ఆహ్లాదకరమైన వాతావరణం.. వీటికి తోడు వెండితెరపై సంచలనం సృష్టించిన ఓ బ్లాక్‌బస్టర్ సినిమా షూటింగ్ లొకేషన్.

పర్యాటకులను కట్టిపడేస్తున్న ‘పుష్ప బ్రిడ్జ్’! మోతుగూడెం అందాలకు ఫిదా అవుతున్న సందర్శకులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దట్టమైన అడవులు, చుట్టూ పచ్చదనం, మనసును దోచే ఆహ్లాదకరమైన వాతావరణం.. వీటికి తోడు వెండితెరపై సంచలనం సృష్టించిన ఓ బ్లాక్‌బస్టర్ సినిమా షూటింగ్ లొకేషన్. వెరసి ఆ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని మోతుగూడెం ఫోర్‌బే డ్యామ్ బ్రిడ్జ్ ఇప్పుడు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి రమణీయతకు నిలువెత్తు అద్దంలా ఉండే ఈ వంతెనను స్థానికులు, పర్యాటకులు ఇప్పుడు ముద్దుగా ‘పుష్ప బ్రిడ్జ్’ అని పిలుచుకుంటున్నారు.

‘పుష్ప’తో మారిన రూపురేఖలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సూపర్ హిట్ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీసుల తనిఖీలకు సంబంధించిన ఉత్కంఠభరిత దృశ్యాలను ఈ మోతుగూడెం ఫోర్‌బే డ్యామ్ వంతెన పైనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు, అందులోని లొకేషన్లు కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో అప్పటివరకు స్థానికులకే పరిమితమైన ఈ వంతెన.. సినిమా హిట్ అయిన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

సెలవు దినాల్లో పర్యాటకుల సందడి..

‘పుష్ప’ సినిమా పాపులారిటీతో సినీ ప్రియులు, పర్యాటకులు ఈ వంతెనను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారాంతాలు, సెలవు దినాల్లో ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే.. తమ అభిమాన హీరో నటించిన సినిమాలోని సీన్లను గుర్తుచేసుకుంటూ వంతెనపై ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందితే, స్థానికులకు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story