జాతీయ రహదారులపై పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి

by Taduka Kalyani |

జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యల అమలుకై పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, రవాణా, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు.

జాతీయ రహదారులపై పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యల అమలుకై పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, రవాణా, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనగా, కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారులపై అనధికారికంగా భారీ వాహనాలు నిలపనీయ్యకుండా కఠిన చర్యలు చేపట్టాలని, నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలపడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణాలను నివారించడం, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం, పౌరుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం, డ్రోన్ సర్వేల ద్వారా ఆక్రమణలను గుర్తించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే జిల్లా స్థాయిలో హైవే భద్రతా టాస్క్ ఫోర్స్‌ను సమర్థవంతంగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని, పోలీసు, రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ, ఇతర సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలని సూచించారు. జాతీయ రహదారులపై నిఘా, పహారా వ్యవస్థను బలోపేతం చేయడం, అత్యవసర వైద్య సేవలు, రికవరీ వాహనాలు, ట్రక్ లే-బై సౌకర్యాలు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, తగిన లైటింగ్, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి రహదారి భద్రతా చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి స్థాయిలో అమలు చేసి, శాఖల వారీగా అనుసరణ నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.

Next Story