Karnataka High Court: వయోజన కుమార్తె ఉన్నత విద్యకు తండ్రే ఖర్చు భరించాలి

by S Gopi |

తన కుమార్తె ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసిందని, మేజర్ అయినందున పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని తండ్రి వేసిన పిటిషన్‌ను జస్టిస్ హెచ్.పి. సందేశ్ ధర్మాసనం కొట్టివేసింది.

Karnataka High Court: వయోజన కుమార్తె ఉన్నత విద్యకు తండ్రే ఖర్చు భరించాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: కుటుంబంలో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, వయోజనురాలైన (మేజర్) అవివాహిత కుమార్తె తన పైచదువుల ఖర్చుల కోసం తల్లిదండ్రులపై గృహ హింస నిరోధక చట్టం కింద కేసు పెట్టవచ్చని, ఆర్థిక సహాయం కోరవచ్చని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నీట్ పీజీలో 11,722వ ర్యాంకు సాధించి మంగళూరులోని ఫాదర్ ముల్లర్స్ కాలేజీలో ఎం.డి. (డెర్మటాలజీ) ప్రవేశం పొందిన 23 ఏళ్ల కుమార్తె విద్యా ఖర్చుల కోసం రూ. 16 లక్షలు చెల్లించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. తన కుమార్తె ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసిందని, మేజర్ అయినందున పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని తండ్రి వేసిన పిటిషన్‌ను జస్టిస్ హెచ్.పి. సందేశ్ ధర్మాసనం కొట్టివేసింది. ఎంబీబీఎస్ నుండి పీజీ వరకు చదువు అనేది ఒకే విద్యా ప్రయాణమని, తండ్రికి భారీగా ఆస్తులు, ఐటీ రిటర్నుల ప్రకారం తగినంత ఆర్థిక స్థోమత ఉన్నందున ఈ ఖర్చును ఆయనే భరించాలని స్పష్టం చేసింది.

గృహ హింస చట్టం కేవలం తిండికే పరిమితం కాదు

ఈ కేసు విచారణ సందర్భంగా గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం-2005 లోని సెక్షన్ 20(డి)ని హైకోర్టు లోతుగా విశ్లేషించింది. చట్టంలోని 'ఆర్థిక సహాయం' అనేది కేవలం ప్రాథమిక జీవన భరణానికి (తిండి, బట్ట) మాత్రమే పరిమితం కాదని, కేసు వాస్తవాలను బట్టి ఉన్నత విద్యా ఖర్చులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. కుమార్తె తన మొదటి ఏడాది ఫీజు కోసం తాతగారి వద్ద రూ. 14 లక్షలు అప్పు తీసుకున్న విషయాన్ని, ఆమెకు స్వతంత్ర ఆదాయం లేకపోవడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 'నీలిమా చౌరే' తీర్పును ఉటంకిస్తూ.. పిల్లలు చదువుకోవడానికి చట్టబద్ధమైన హక్కు ఉందని, స్థోమత ఉన్న తల్లిదండ్రులు ఆ ఖర్చులను ఖచ్చితంగా భరించాలని తేల్చిచెప్పింది. వయోజనురాలైనంత మాత్రాన ఒక కూతురికి చదువుకునే హక్కు రద్దయిపోదని స్పష్టం చేస్తూ కింది కోర్టుల ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.

Next Story