కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్.. "దోపిడీ దొంగ కేసీఆర్"

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-08 07:16:19  IST  )

కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్.. దోపిడీ దొంగ కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు బీజేపీనే ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచిందని తెలిపారు. కరీంనగర్ లోని రేకుర్తి శుభం గార్డెన్స్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీ కాంగ్రెస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ కూడా విభజన చట్టంలో తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.

బీఆర్ఎస్ చేసిన పాపాలు.. తెలంగాణ ప్రజలకు శాపాలు

నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొలిటికల్ డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, అవినీతిపై విచారణ లేకుండా బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన పాపాలు.. తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలాడారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ తీరుపై ఉద్యమం చేసింది బీజేపీనే అని, ఆనాడు కాంగ్రెస్ ఎన్నడైనా ఉద్యమాలు చేసిందా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరగొద్దని అనేక మీటింగ్ లు పెట్టింది కేంద్రమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం చేసిన మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

ఆనాడు కాంగ్రెస్ నేతలు ఎందుకు నిలదీయలేదు?

ఉమ్మడి ఏపీలో కృష్ణా వాటాలో 811 టీఎంసీలుంటే.. ఏనాడూ తెలంగాణకు 200 టీఎంసీలకు మించి నీటిని వాడుకోకుండా ఇక్కడి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్సేనన్నారు. గోదావరిలో 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే.. తెలంగాణలో ఎన్నడూ 500 టీఎంసీలకు మించి వాడుకోలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంపై సీఎం రేవంత్ అబద్దాలాడారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన యాక్ట్ లోనూ తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే ఆరోపించారు. ఏపీ పునర్విభజన యాక్ట్ సెక్షన్ 89 ప్రకారం.. రాష్ట్ర విభజన నాటికి నిర్మాణంలో, ప్లాన్ లో ఉన్న నీటి ప్రాజెక్టులపై అభ్యంతరం తెలపొద్దని స్పష్టంగా ఉందని, ఆ సెక్షన్ లో ఏపీలోని 4, తెలంగాణలోని 2 ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పొందుపర్చారని బండి సంజయ్ వివరించారు. మరి తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదని, ఆనాడు అధికారంలో ఉన్న ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నేతలు ఎందుకు నిలదీయలేదు? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

బీఆర్ఎస్ ఎందుకు బయటపెట్టలేదు?

PRLI ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎందుకు బయట పెట్టలేదని బండి సంజయ్ నిలదీశారు. గత ప్రభుత్వం కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేదన్నారు. దీనివల్ల 60 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసిపోయాయని తెలిపారు. కృష్ణా జలాల్లో వాటా ప్రకారం తెలంగాణకు 571 టీఎంసీ నీళ్లు రావాలి .. 299 టీఎంసీ నీళ్లు ఏపీకి వెళ్ళాలి .. కానీ వాటాలు రివర్స్ అయ్యాయని పేర్కొన్నారు. కృష్ణాజలాల పంపిణీపై ఉమాభారతి సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్, హరీష్ రావు ఒప్పందం చేసుకున్నారన్నారు.

కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం

తెలంగాణ వచ్చాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 4.3 టీఎంసీల నుండి ఏకంగా 13.7 టీఎంసీలకు పెంచినా నోరు మెదపని సన్నాసి కేసీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దోపిడీకి స్కెచ్ వేసిన నాయకుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. రూ.30 వేల కోట్ల వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టును.. రూ.లక్ష కోట్లకు పెంచి వేల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగ కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు.

Read More..

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ని కలవనున్న కాంగ్రెస్ మంత్రులు..! ఎందుకంటే?

Next Story