నడ్డి విరుస్తున్న వడ్డీ దందా!

by Jakkula.Mamatha |

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పలు గ్రామాలు, పట్టణాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

నడ్డి విరుస్తున్న వడ్డీ దందా!
X

దిశ, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పలు గ్రామాలు, పట్టణాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొందరు వ్యక్తులు అధిక వడ్డీలకు రుణాలు ఇస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ దందాలో రైతులు, చిరు వ్యాపారులు, రోజువారీ ఉపాధి పై ఆధారపడే వారే ఎక్కువగా నష్ట పోతున్నట్లు సమాచారం.

అనుమతులు లేకుండానే వ్యాపారం..

చట్టం ప్రకారం వడ్డీ వ్యాపారం నిర్వహించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేసుకుని, నిర్ణీత ఫీజు చెల్లించి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అలాగే వడ్డీ రేట్లు చట్టబద్ధ పరిమితుల్లో ఉండాలి. ప్రతి ఏడాది లెక్కలను సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే మండలంలో చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండానే వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బంగారు ఆభరణాలపై అధిక వడ్డీ..

అత్యవసర అవసరాల కోసం వచ్చే రైతులు, చిన్న వ్యాపారుల నుంచి బంగారు ఆభరణాలు కుదువ పెట్టించుకుని అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చట్టబద్ధ పరిమితులను మించి 25 నుంచి 30 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. పంట కాలాన్ని ఆసరాగా చేసుకుని కొద్ది నెలల్లోనే వడ్డీతో పాటు అసలు కూడా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రోజువారీ వసూళ్లతో భారం..

కూరగాయల వ్యాపారులు, టీ దుకాణాలు, పాన్ షాపులు, ఆటో, జీపు డ్రైవర్లు వంటి రోజువారీ ఆదాయం పై ఆధారపడే వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు రోజువారీ వడ్డీ విధానం అమలు చేస్తున్నారు. రూ.10 వేల రుణానికి ముందుగానే రూ.వెయ్యి వడ్డీ పేరుతో మినహాయించి రూ.9వేలు చెల్లించి రోజు రూ..100 చొప్పున 100 రోజుల పాటు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చిన్న మొత్తంలో తీసుకున్న అప్పు కూడా పెద్ద భారంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల చర్యలు శూన్యం..

మండలంలో అనుమతులు లేకుండా సాగుతున్న వడ్డీ వ్యాపారం పై రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధిక వడ్డీల బారిన పడుతున్న రైతులు, చిరు వ్యాపారులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story