విద్యార్థులకు చికెన్ ముక్క ఏదీ?

by Jakkula.Mamatha |

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అందించే చికెన్ మెనూలో అందడం లేదు.

విద్యార్థులకు చికెన్ ముక్క ఏదీ?
X

దిశ,మిర్యాలగూడ టౌన్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అందించే చికెన్ మెనూలో అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వలన వేల మంది విద్యార్థులకు చికెన్ మెనూ నీరుగారుతోంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కొన్ని కారణాల వలన చేతులెత్తడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు చికెన్‌కు దూరమైతున్నారు. మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో, కేజీబీవీ స్కూల్స్, తెలంగాణ మోడల్ స్కూల్స్ లలో చికెన్ సరఫరా నిలిచిపోయింది. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో సుమారు 33 గురుకుల, కస్తూర్భా, మోడల్ పాఠశాల లు ఉన్నాయి. అయితే పాఠశాల ప్రారంభంలోనే విద్యార్ధులకు చికెన్ సరఫరా చేయుటకు టెండర్ ప్రకటించగా ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాడు.

కానీ కాంట్రాక్టు దక్కించుకున్న టెండర్ దారుడు సరఫరా చేయడంలో జాప్యం చేశారు.నెలకు నాలుగు సార్లు చికెన్ అందించాల్సి ఉంది. కానీ టెండర్ దక్కించుకున్న నాటి నుంచి సరఫరా చేయడం లేదు. దీనివలన విద్యార్థులకు మెనూ ప్రకారం చికెన్ అందడం లేదు. పాఠశాల ప్రారంభం నుంచి అందజేయాల్సి ఉన్న సరఫరా నిలిచిపోయింది. సుమారు 17 సార్లు చికెన్ మెనూ అందకుండా అయింది. అయినప్పటికీ ఆయా గురుకుల కస్తూర్బా, మోడల్ పాఠశాల అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చేతులెత్తిసిన కాంట్రాక్టర్..

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని గురుకుల, కస్తూర్బా, మోడల్ పాఠశాలలకు చికెన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ చేతులెత్తేశాడని తెలిసింది. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్న పాఠశాలకు చికెన్ అందివ్వలేనని సదరు కాంట్రాక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు లేఖ ద్వారా సమాచారం అందించారని తెలిసింది. కాంట్రాక్టర్ వ్యక్తిగత కారణాల వలన ఈ సమస్య తలెత్తినట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అర్ధంతరంగా టెండర్ దారుడు సరఫరా చేయలేనని చెప్పడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం. దేవరకొండ, చండూర్, నల్గొండలో కూడా ఇదే కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు.

మెనూ ప్రకారం చికెన్ అందువ్వాలి: పగిడి జీడయ్య యాదవ్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ అధ్యక్షుడు

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ గురుకులాల్లో మెనూ ప్రకారం చికెన్ వడ్డించాలి. కాంట్రాక్టర్ చికెన్ సరఫరా చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆయా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చికెన్ సరఫరా చేయడం లేదు. తక్షణమే ఆ టెండర్ దారుని బ్లాక్ లిస్టులో పెట్టాలి. మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా జూన్ 30 నుంచి ఇప్పటివరకు సుమారు 17 రోజుల పాటు చికెన్ పెట్టకుండా టెండర్ దారుడు నిర్లక్ష్యం వహించడం వలన విద్యార్థులకు సరైన మెనూ అందడం లేదు. మరోక టెండర్ దారుడికి అవకాశం కల్పించి విద్యార్థులకు చికెన్ సరఫరా చేయాలి.

Next Story