రాష్ట్రంలో ఆగిన ‘ప్రగతి రథ’ చక్రాలు.. రోడ్డెక్కని బస్సులు, ప్రయాణికులు బేజారు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-22 02:52:47  IST  )

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మే మొదలైంది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

రాష్ట్రంలో ఆగిన ‘ప్రగతి రథ’ చక్రాలు.. రోడ్డెక్కని బస్సులు, ప్రయాణికులు బేజారు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ (RTC) కార్మికుల జేఏసీ పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభమైంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేయడంతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. తెల్లవారుజాము నుంచే బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

డిపోల వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు

రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తుండటంతో పలుచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. డిపోల లోపలికి ప్రైవేటు డ్రైవర్లను తీసుకెళ్లే క్రమంలో కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రయాణికులపై ఛార్జీల భారం..

బస్సులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు, క్యాబ్ డ్రైవర్లు అడ్డగోలు వసూళ్లకు తెరలేపారు. సాధారణ ఛార్జీల కంటే 20 నుంచి 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ఇక యాప్ ఆధారిత సర్వీసులైన ఓలా, ఉబర్, రాపిడో వంటి సర్వీసుల్లో ‘సర్జ్ ప్రైసింగ్’ (Surge Pricing) కారణంగా రెట్టింపు ధరలు చూపిస్తున్నాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎంటీఎస్, మెట్రో టైన్లు కూడా ఫుల్..

సమ్మే కారణంగా బస్సులు లేకపోవడంతో ఎంఎంటీఎస్ (MMTS), మెట్రో రైళ్లు (Metro Trains)లో రద్దీ సాధారణం కంటే దాదాపు ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ప్రయాణికులు ఫుట్ బోర్డులపై వేలాడుతూ ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సమ్మెను నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో పరిమిత సంఖ్యలో బస్సులను నడిపేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. అయితే, తమ ఐక్యతను చాటుతూ సమ్మెను విజయవంతం చేస్తామని జేఏసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని వారు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో డిపోలకే పరిమితమైన బస్సులు.. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన

Next Story