- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గచ్చిబౌలిలో జాతీయ స్థాయి పోలీస్ క్రీడలు.. 8 రోజుల పాటు పోటీలు
జాతీయ స్థాయి పోలీస్ క్రీడలకు నగరం మరోసారి వేదిక కానుంది. ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ పర్యవేక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో 11వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్ 2026 జరగనుంది..

దిశ,తెలంగాణ బ్యూరో: జాతీయ స్థాయి పోలీస్ క్రీడలకు నగరం మరోసారి వేదిక కానుంది. ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ పర్యవేక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో 11వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్ 2026 జరగనుంది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఎనిమిది రోజుల పాటు ఈ పోటీలు సాగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో సత్తా చాటనున్నా అథ్లెట్లు..
దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల కు చెందిన సుమారు 1,600 మంది క్రీడాకారులు తలపడనున్నారు. జూడో, వూషు, తైక్వాండో, కరాటే, పెన్కాక్ సిలాట్ అనే ఐదు యుద్ధ క్రీడల మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో అథ్లెట్లు తమ సత్తా చాటనున్నారు. యూనిఫామ్ సర్వీసెస్‌లోని క్రీడాకారులకు ఈ వేదిక ఒక అద్భుతమైన అవకాశం. క్రమశిక్షణ, పట్టుదల ఉన్న పోలీసు క్రీడాకారులు ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారని అదికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడలకు సన్నాహకంగా..
ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడలకు ముందు ఈ జాతీయ ఛాంపియన్‌షిప్ జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జూడో, వూషు, తైక్వాండో, కరాటే క్రీడలు ఆసియా గేమ్స్‌లో పతక ఈవెంట్లు కావడంతో, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు మన పోలీసు అథ్లెట్లకు ఇది ఒక డ్రెస్ రిహార్సల్ లాంటిదని అధికారులు అభిప్రాయపడ్డారు. 2025లో అమెరికాలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ బోర్డ్ క్రీడాకారులు 280 స్వర్ణాలతో సహా ఏకంగా 600 పతకాలు సాధించి 71 దేశాల్లో మూడో స్థానంలో నిలిచిన ఘనతను అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం..
నాడా పర్యవేక్షణ క్రీడల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలు పూర్తి సహకారం అందిస్తున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ క్రీడా మౌలిక సదుపాయాలు సమకూరుస్తుండగా, తెలంగాణ పోలీస్ అకాడమీ వసతి, రవాణా తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. డోపింగ్ రహితంగా, అత్యంత పారదర్శకంగా పోటీలు నిర్వహించేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అధికారులను కూడా రప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సమావేశంలో ఎన్‌ఐఎస్‌ఏ డైరెక్టర్ ఐజీ హర్‌ప్రీత్ కౌర్ సోహి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఒలింపియన్ పారుపల్లి కశ్యప్, జాతీయ రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.






