- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల సంక్షేమానికి పెద్దపీట.. ప్రతి ఉద్యోగికి ఆరోగ్య భద్రత : డీజీపీ సీ.వీ. ఆనంద్
పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు.

- పిల్లల చదువులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు
- తక్కువ వడ్డీకే గృహ, విద్య, వివాహ రుణాలు
- సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికీ అందాలి
దిశ,తెలంగాణ బ్యూరో: పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత విభాగాలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేలా సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని, వీటిని వ్యాపార దందాగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఆరోగ్య భద్రత పథకం ద్వారా రూ. 255 కోట్లకు పైగా ఖర్చు
ఆరోగ్య భద్రతతో వేలాది మందికి లబ్ధి పోలీసు ఆరోగ్య భద్రత పథకం ద్వారా సిబ్బందికి నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని డీజీపీ తెలిపారు. 2025 సంవత్సరంలో 33,126 మంది, 2026 జూన్ నాటికి 12,392 మంది సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా చికిత్స పొందారని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ. 255 కోట్లకు పైగా ఖర్చు చేసిందని వివరించారు. అలాగే, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బంది కుటుంబాలకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద హోదాల వారీగా రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు బీమా రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పథకాల అమలులో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలి
పిల్లల చదువులకు ప్రత్యేక ప్రోత్సాహం పోలీసుల పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లతో పాటు జేఈఈ, నీట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని డీజీపీ నిర్ణయించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్వహణతో పాటు స్కాలర్‌షిప్‌లు, వివాహ సాయం కోసం పోలీస్ క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకాల అమలులో జాప్యం లేకుండా ఉండేందుకు సంక్షేమ సేవలన్నింటినీ ఆన్‌లైన్ చేసి, సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలని సూచించారు.
పోలీసు సిబ్బంది కోసం తక్కువ వడ్డీకే రుణాలు
తక్కువ వడ్డీకే రుణాలు సిబ్బంది ఆర్థిక అవసరాల కోసం తక్కువ వడ్డీకే రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. గృహ రుణాలకు 6.75 శాతం, ఓపెన్ ప్లాట్లకు 9 శాతం, వ్యక్తిగత రుణాలకు 11 శాతం వడ్డీతో పాటు కుమార్తె వివాహానికి రూ. 6 లక్షలు, విదేశీ విద్య కోసం రూ. 30 లక్షల వరకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రూపాయి జవాబుదారీతనంతో ఖర్చు కావాలని, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి పోలీసు కుటుంబానికి అందాలని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమీక్షలో డీజీ మహేష్ భగవత్, ఏడీజీ సంజయ్ జైన్, ఐజీలు షహనవాజ్ ఖాసిం, గజరావు భూపాల్, వెల్ఫేర్ కార్యదర్శి ఉదయ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.






