అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

by Batti.Sumithra |

ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస ఇంటి చోరీ కేసులను మావల పోలీసులు ఛేదించి మహారాష్ట్రకు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస ఇంటి చోరీ కేసులను మావల పోలీసులు ఛేదించి మహారాష్ట్రకు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన షిండే సునీల్ అలియాస్ రాకీ, కుమ్రే సుజల్ యురాజ్, మార్జివే శేఖర్, గాయకవాడ్ లక్ష్మణ్ లు ఆదర్శ్‌నగర్, టైలర్స్ కాలనీల్లో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మావల పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు ఆభరణాలు, 25.5 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు షిండే సునీల్‌పై గతంలో 8, కుమ్రే సుజల్ యురాజ్‌ పై 3 దొంగతనం కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన ఇతర చోరీ కేసుల్లోనూ వీరి ప్రమేయం పై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన నగదు, ఆభరణాలను భద్రంగా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మావల సీఐ బీడీ.ప్రేమ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది షబ్బీర్, సట్ల శ్రీను, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story