- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలతో వచ్చిన తిప్పలు.. అమాత్యులకు పదవీ గండం?
రానున్న మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు పెద్ద సవాలుగా మారాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు బాధ్యతలను అధిష్టానం అప్పగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు పెద్ద సవాలుగా మారాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే సదరు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులో మైనస్ మార్కులు పడతాయని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రభావం భవిష్యత్‌లో జరగనున్న కేబినెట్ ప్రక్షాళన మీద ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది. ఈ విషయం గ్రహించిన మంత్రలు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తెల్లారి నుంచే తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు లీడర్లను సమన్వయం చేస్తూ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరుతున్నారు.
మంత్రులకు డబుల్ టాస్క్..
మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిలుగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక్కో మంత్రిని నియమించారు. ఆ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులదే. వీరంతా ఎన్నికల ముగిసే వరకు అక్కడే ఉంటూ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకోవాల్సి ఉంది. అలాగే, అక్కడ పార్టీకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. ఒక రకంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గెలుపు ఓటములకు మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఫోకస్ పెట్టాలి. లేకపోతే సొంత నియోజకవర్గంలో మంత్రికి పట్టులేదని విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు ఇన్‌చార్జిగా ఉన్న ఏరియాతో పాటే సొంత నియోజకవర్గంలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది.
ఫెయిలైతే మంత్రి పదవికి గండం?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ గుర్తులతో జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో చాలెంజ్‌గా తీసుకున్న ఏఐసీసీ.. మెజార్టీ మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి టార్గెట్ విధించింది. అందుకోసం మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికలు మంత్రుల పనితీరుకు నిదర్శనమని, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే చర్యలు ఉంటాయనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. ఒకవేళ ఫలితాలు తలకిందులైతే ఆయా మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులో మైనస్ మార్కులు పడతాయని ప్రచారం జరుగుతున్నది. కేవలం మైనస్ మార్కులు పడితే పర్వాలేదు. కానీ, ఏకంగా ఉన్న మంత్రి పదవి పోవడమో, లేక శాఖలు మారడమో జరిగే అవకాశం ఉందని చర్చ సైతం జరుగుతున్నది. అందుకే మంత్రులు రోజులో ఎక్కువ టైమ్ తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.






