అధికార పార్టీలో టికెట్ల పంచాయతీ షురూ.. ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు Vs ఇంచార్జ్‌లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-03 03:37:59  IST  )

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వలస ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసి ఓడిన లీడర్ల మధ్య పంచాయితీ తారా స్థాయికి చేరింది.

అధికార పార్టీలో టికెట్ల పంచాయతీ షురూ.. ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు Vs ఇంచార్జ్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వలస ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసి ఓడిన లీడర్ల మధ్య పంచాయితీ తారా స్థాయికి చేరింది. పోటాపోటీగా తమ అనుచరులను బరిలోకి దింపిన ఇరువర్గాలు తమకే బీ ఫామ్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. తమకు చాన్స్ ఇవ్వకపోతే మాత్రం బరిలో కొనసాగుతామని జగిత్యాల, గద్వాల, స్టేషన్ ఘణపూర్, చేవెళ్ల, బాన్సువాడ నియోజకవర్గాల్లో అల్టిమేటం జారీ చేశారు. ఉంది. ఆ సెగ్మంట్‌లో ఏ వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలో, ఎవరిని పక్కన పెట్టాలో తెలియక ఇన్‌చార్జు మంత్రులు తలలు పట్టుకున్నారు. కొన్ని సెగ్మంట్ల పంచాయితీ నేరుగా సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో ఆయన నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇరువర్గాల సవాల్..

సర్వేల ఆధారంగానే గెలుపు అవకాశాలు ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. కానీ మొదట్నించి పార్టీలో ఉన్న వ్యక్తులకు కాదని వలస వచ్చిన వారికి టికెట్లు ఇస్తే సహించమని కాంగ్రెస్ లీడర్లు స్ఫష్టం చేస్తుండగా, వలస ఎమ్మెల్యేల సన్నిహితులు సైతం అంతే స్థాయిలో సవాలు విసురుతున్నారు. తమతో పాటు పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోతే ఊరుకోమని అవసరమైతే రెబల్‌గా పోటీ చేసే తమ సత్తా చూపిస్తామని సవాలు విసురుతున్నాయి.

మంత్రుల బుజ్జగింపులు..

ఈ ఎన్నికలు పోటీ చేసి ఓడిపోయిన నేతలు, ఇటు వలస ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్‌కు నాంది పలకనున్నాయి. తమ అనుచరులకు తక్కువ సీట్లు దక్కితే పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని సంకేతాలు వెళ్లడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ రాదనే ఆందోళనతో పరస్పరం పోటీలు పడుతున్నారు. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్ని టికెట్లు తమకే ఇవ్వాలిన పట్టుపడుతుండగా, సగం టికెట్లు తమ అనుచరులకు ఇవ్వాలని సెగ్మంట్ ఇన్ చార్జి సరితా యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం నేరుగా ఇరువురుకి ఫోన్ చేసి సర్దిచెప్పినట్లు సమాచారం. మిగతా నియోజకవర్గంలోని వివాదాలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత సెగ్మంట్లకు ఇన్ చార్జులుగా ఉన్న మంత్రులను సీఎం ఆదేశించారు. మంత్రులు సోమవారం సంబంధిత ఇన్ చార్జులు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి రాజీకుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏఐసీసీ జోక్యం చేసుకోదు..

గద్వాల రాజకీయాలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం అచ్చంపేట బల్మూరు మండలం చెంచుగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకంపై పరిశీలనకు వెళ్లిన ఆమె.. పార్టీలో ఎలాంటి వర్గ బేధాలు లేవన్నారు. ఆ విషయం ఏఐసీసీకి సంబంధం లేదని, జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, జిల్లా అధ్యక్షుడు, స్థానికుల సమన్వయంతో మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమే తప్ప దాంట్లో వాస్తవం లేదన్నారు.

మున్సిపల్ ఎన్నికలతో వచ్చిన తిప్పలు.. అమాత్యులకు పదవీ గండం?

Next Story