- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడున్న ముఖ్యమంత్రి నయా హిట్లర్.. నిప్పులుచెరిగిన కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మునీరాబాద్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రస్తుతం నయా హిట్లర్, కర్కోటకుడి పాలన నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ధ్వజమెత్తారు. మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, అటు బీఆర్ఎస్ అవినీతికి నిలయంగా మారిందని ఆమె ఆరోపించారు.
ఉద్యమకారులకు అన్యాయం..
తెలంగాణ (Telangana) కోసం పోరాడిన వారు నేడు రోడ్డున పడ్డారని, ఉద్యమ సమయంలో మనల్ని కొట్టి, తిట్టిన వారు ఇప్పుడు ఉన్నత పదవుల్లో అనుభవిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో 30 వేల మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నా, ఎంతమంది ఉద్యమకారులకు గుర్తింపు దక్కిందని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం (Kaleshwaram)లో అవినీతి జరిగిందని ప్రశ్నించినందుకు తనను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి గెంటేశారని ఆమె వెల్లడించారు. అవినీతికి పాల్పడిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారని, బీఆర్ఎస్ చేసిన తప్పులు చాలా ఉన్నాయని అన్నారు. ఇది బీఆర్ఎస్ (BRS) పార్టీకి ట్రైలర్ మాత్రమేనని.. ముందు ముందు అన్ని విషయాలను ప్రజల ముందు పెడతానని కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీకి తెలంగాణ రావడమే ఇష్టం లేదు..
తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకనే బీజేపీ పెద్దలు ‘తల్లిని చంపి బిడ్డను తీశారు’ అంటూ కవిత ఫైర్ అయ్యారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను ఏకంగా భారత్-పాక్ విభజనతో పోల్చుతారు. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నా బీజేపీ బానిస ఎంపీలు నోరు మెదపలేదని మండిపడ్డారు. సామాజిక న్యాయం అనే పదానికే బీజేపీ బద్ధ వ్యతిరేకి అని ఆమె విమర్శించారు. మహిళా బిల్లును పక్కన పెట్టారని, బీసీ బిల్లు, కులగణన బిల్లులను తొక్కిపెట్టారని ఆరోపించారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి తెలంగాణకు చెందిన 7 మండలాలను బలవంతంగా తీసుకున్నారని, అయినా రాష్ట్ర బీజేపీ ఎంపీలు పెదవి విప్పలేదని కవిత ఎద్దేవా చేశారు. ‘నేను ఈ బీజేపీ బానిస ఎంపీలకు సవాల్ చేస్తున్నా.. మీరు నిజమైన తెలంగాణ బిడ్డలైతే, భద్రాచలం వద్ద ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు పట్టుకురండి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. వాటిని కాపాడే దమ్ము మీకుందా?’ అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి రాకపోయినా, రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే బీజేపీ ఎంపీలు ప్రాముఖ్యత ఇస్తున్నారని కవిత విమర్శించారు.
‘పాంచజన్యం’ పేరుతో మేనిఫెస్టో విడుదల
కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించినట్లుగా, తాను కూడా ఐదు ప్రధానాంశాలతో కూడిన ‘పాంచజన్యం’ (Panchajanyam) మేనిఫెస్టోను కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
విద్య: ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య. ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.
వైద్యం: ఏ రోగానికైనా, ఏ ఆసుపత్రికి వెళ్లినా పూర్తి ఉచితంగా వైద్యం అందేలా చూస్తామన్నారు.
వ్యవసాయం: ‘రైతే రాజు’ నినాదాన్ని నిజం చేస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నారు.
ఉపాధి: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
సామాజిక న్యాయం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సమన్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
అవినీతి, బంధుప్రీతితో నిండిపోయిన ప్రస్తుత పార్టీలకు ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ నిలుస్తుందని కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.
‘ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!’.. కవిత పార్టీపై బీఆర్ఎస్ కౌంటర్






