కార్మికుల శ్రమ సీఎంకు అర్థం కావట్లేదు.. ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 09:38:32  IST  )

తెలంగాణలో కార్మికుల శ్రమను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించడం లేదని, హైడ్రా పేరుతో వారి ఇళ్లను కూల్చుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

కార్మికుల శ్రమ సీఎంకు అర్థం కావట్లేదు.. ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల శ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి అర్థం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శించారు. మే డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఆదుకుందని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకున్నామని గుర్తు చేశారు. మున్సిపల్, విద్యాశాఖలను సీఎం తన వద్దే పెట్టుకున్నారని.. దీంతో ఆ వ్యవస్థలు కుప్పకూలే స్థాయికి చేరుకుంటున్నాయని ఆరోపించారు. SLBC సొరంగం పనుల్లో చనిపోయిన కార్మికుల మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయారని దుయ్యబట్టారు. అదేవిధంగా సిగాచి కంపెనీ (Sigachi Company) ప్రమాదంలో చనిపోయిన కార్మికులను నేటికీ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. హైడ్రా పేరుతో కార్మికుల ఇళ్లను రేవంత్ సర్కార్ కూల్చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రం దివాళా తీసిందని అనడం భావ్యమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.

కేంద్రం సామాన్యుల నడ్డి విరిచింది..

కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శించారు. ఈ రకమైన నిర్ణయాలతో సామాన్యుడు జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ కార్మికుల నడ్డి విరిచేలా కేంద్ర నిర్ణయం ఉందని ధ్వజమెత్తారు. గతంలో ఎవరూ ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ ధరలను పెంచలేదని అన్నారు. ఈ ప్రభావం కార్మికులు, సామాన్యులపై ప్రతికూలంగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.

కార్మిక పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్

Next Story