- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వ్యవసాయంపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం.. మంత్రి తుమ్మల ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ రైతులకు, రాష్ట్ర వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రైతులపై అదనపు భారాన్ని మోపేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ (Oil palm) సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, అయితే కేంద్రం మాత్రం అందుకు సహకరించడం లేదని తుమ్మల పేర్కొన్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం (Import Duty) పెంచాలని మేము పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. దీంతో దేశీయ రైతులకు గిట్టుబాటు ధర లభించడం కష్టతరమవుతోందన ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు, కొబ్బరి బోర్డులపై నిర్లక్ష్యం..
రాష్ట్రానికి ఎంతో కీలకమైన జాతీయ పసుపు బోర్డుకు బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కూడా కేటాయించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బోర్డు ఏర్పాటు పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఆచరణలో రైతులకు మేలు చేసే నిధులు కరువయ్యాయని అన్నారు. అలాగే, తెలంగాణలో కొబ్బరి సాగు గణనీయంగా పెరుగుతున్నా, రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన కేంద్రం, ఎరువులపై సబ్సిడీలు తగ్గించడం ద్వారా ధరలు పెరిగేలా చేస్తోందని మంత్రి విమర్శించారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల సాగు ఖర్చులు భారమై, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్రం ప్రసంగాల్లో రైతు సంక్షేమం గురించి చెబుతున్నా.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అది ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. నిర్మలా బడ్జెట్ తెలంగాణ రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని, కేంద్రం తన వైఖరిని మార్చుకుని రాష్ట్రానికి రావాల్సిన వాటాను, నిధులను వెంటనే కేటాయించాలని తుమ్మల డిమాండ్ చేశారు.






