- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ వేముల మనల్ని విడిచివెళ్లి నేటికి పదేళ్లు.. వర్ధంతి సందర్భంగా రాహుల్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘన నివాళి అర్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘన నివాళి అర్పించారు. శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ‘రోహిత్ వేముల చట్టం’ (Rohit Vemula Act) తీసుకురావాల్సిన అవసరం ఉందని మరో సారి నొక్కి చెప్పారు. తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని త్వరలోనే అమలు చేసే దిశగా ప్రక్రియను మొదలుపెట్టాయని రాహుల్ కీలక ప్రకటన చేశారు. ‘రోహిత్ వేముల మనల్ని విడిచి వెళ్లి నేటికి పదేళ్లు పూర్తయింది. కానీ, ఈ దేశంలో కలలు కనే హక్కు అందరికీ సమానంగా ఉందా? అనే రోహిత్ ప్రశ్న నేటికీ మన గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది’ అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ చదువుకోవాలనుకున్నాడని, విజ్ఞాన శాస్త్రం, సమాజం పట్ల అవగాహన పెంచుకుని దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాడని.. కానీ, ఒక దళిత విద్యార్థి ఎదుగుదలను ఈ వ్యవస్థ సహించలేకపోయిందని ఆయన ఆరోపించారు.
కులమే అతిపెద్ద అడ్మిషన్ ఫామ్
సంస్థాగత కులతత్వం, సామాజిక బహిష్కరణ, నిత్యం అవమానాలు, అమానవీయ ప్రవర్తనలే ఒక మెరిసే యువకుడిని ఆత్మహత్య చేసుకునే స్థితికి నెట్టేశాయని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత కూడా దళిత యువత పరిస్థితిలో మార్పు రాలేదని, క్యాంపస్‌లు, హాస్టళ్లు, తరగతి గదుల్లో వివక్ష కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. నేటికీ ఈ దేశంలో కులమే అతిపెద్ద 'అడ్మిషన్ ఫామ్'గా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రోహిత్ వేముల యాక్ట్ అనేది కేవలం నినాదం కాదు, అది నేటి తక్షణ అవసరం’ అని రాహుల్ వెల్లడించార. విద్యాసంస్థల్లో కుల వివక్షను నేరంగా పరిగణించడానికి, దోషులను కఠినంగా శిక్షించడానికి, విద్యార్థులను వారి కులం పేరుతో వేధించడాన్ని అడ్డుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
యాంటీ డిస్క్రిమినేషన్ చట్టం
ఈ పోరాటం కేవలం పార్లమెంటుకు పరిమితం కాదని, ఇది క్యాంపస్‌ల పోరాటమని రాహుల్ పేర్కొన్నారు. దళిత యువత తమ గళాన్ని వినిపించాలని, సంఘటితమై 'యాంటీ డిస్క్రిమినేషన్ చట్టం' (Anti-Discrimination Law) కోసం డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఏ దళిత విద్యార్థి తన కలల కోసం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేని, న్యాయమైన భారతదేశాన్ని తాము కోరుకుంటున్నామని, రోహిత్ పోరాటం తమ బాధ్యత అని రాహుల్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More..






