ఉత్తర తెలంగాణలో మండుటెండలు.. ఈ జిల్లాల్లో నేడు వడగళ్లకు ఛాన్స్ !

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-28 05:38:51  IST  )

రాష్ట్రంలో నేడు విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. పలు జిల్లాల్లో వడగళ్లవాన కురిసే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది.

ఉత్తర తెలంగాణలో మండుటెండలు.. ఈ జిల్లాల్లో నేడు వడగళ్లకు ఛాన్స్ !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నేడు (ఏప్రిల్ 28, మంగళవారం) విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఒకవైపు భానుడి ప్రతాపం కొనసాగుతుండగానే, మరోవైపు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం మాదిరిగానే నేడు కూడా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో వడగళ్లు

మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు వడగళ్ల వాన (Hails) కురిసే అవకాశం ఉందని సమాచారం. నిన్నటితో పోలిస్తే నేటి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, అయితే ఈ పరిస్థితి అక్కడక్కడా మాత్రమే కనిపించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

హైదరాబాద్ వాసులకు నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు ఊరట లభించనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్సున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అక్కడక్కడా వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రంగారెడ్డి జిల్లాలో పడిన వడగళ్లతో ప్రజలు సేదతీరారు. మంచుప్రాంతంలో ఉన్నట్లుగా ఉందంటూ వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Next Story