నేడే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సంరంభం.. తెలంగాణ చరిత్రను చాటేలా ఏర్పాట్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-08 02:35:04  IST  )

‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025’కి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ‘ఫ్యూచర్‌ సిటీ’ ముస్తాబైంది.

నేడే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సంరంభం.. తెలంగాణ చరిత్రను చాటేలా ఏర్పాట్లు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025’కి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ‘ఫ్యూచర్‌ సిటీ’ ముస్తాబైంది. ఫ్యూచర్‌ సిటీలోని 70 ఎకరాల్లో సమ్మిట్‌ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమావేశ ప్రాంగణాలు, చర్చా వేదికలు, వాహనాల పార్కింగ్‌ లను ఏర్పాటు చేశారు. అతిథులు విశ్రాంతి తీసుకునేందుకు సైతం సకల వసతులతో ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఘనతను ప్రపంచానికి చాటి చెప్పేలా సమ్మిట్‌ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ సక్సెస్ కోసం పలువురు ఉన్నతాధికారులకు సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మొత్తంగా చరిత్రలో నిలిచిపోయేలా అదిరిపోయే రీతిలో ఏర్పాట్లు చేశారు.

అతిథులకు సకల వసతులు..

రాష్ట్ర ప్రభుత్వం తరపున సుమారు 4,800 మందికి ఆహ్వానాలు వెళ్లాయి. సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలను అందజేశారు. 6 ఖండాలు, 44 దేశాలకు చెందిన 154 మంది అతిథులు సమ్మిట్‌ కు హాజరవుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అలాగే 2 వేల మందికి పైగా అంతర్జాతీయ, జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సమ్మిట్‌ ను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రగతి పురోగతికి సంబంధించిన పలు అంశాలపై నిష్ణాతులతో చర్చాగోష్టులు నిర్వహిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపడుతుండగా.. అథిథులకు వసతుల పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. విశాలమైప పచ్చిక బయళ్లు, పూల మొక్కలతో సమ్మిట్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఉట్టిపడుతున్న తెలంగాణ వైభవం..

తెలంగాణ ఘన చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రభుత్వం సమ్మిట్‌ ఏర్పాట్లను చేస్తుండటంతో అడుగడుగునా తెలంగాణ వైభవం ఉట్టిపడుతోంది. పోచంపల్లి ఇక్కత్‌ శాలువాలు, హైదరాబాద్‌ అత్తర్‌ సీసాలు, ముత్యాల ఆభరణాలు, చేర్యాల పెయింటింగ్స్​ తో కూడిన ‘సావనీర్‌ కిట్‌’ ను అతిథులకు అందజేయనున్నారు. సకినాలు, తీపి అప్పాలు, బదామ్‌ కీ జాలీ, మవా లడ్డూలు వంటి తెలంగాణ రుచులతో నోరూరించే స్వీట్లు, ఇతర వంటకాలను అతిథుల కోసం సిద్దం చేస్తున్నారు. అతిథులను అలరించేందుకు సంగీత కచేరి, వీణా వాయిద్యం వంటి అనేక భిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రామప్ప ఆలయం, కాకతీయ కళా తోరణం, హుస్సేన్‌ సాగర్‌ బుద్ద విగ్రహం, చార్మినార్‌, ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ వంటి చిహ్నాలను సమ్మిట్‌ ప్రాంగణంలోని తెరలపై ముద్రించారు. సమ్మిట్‌ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో తెలియజేసే వివరాలతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సమ్మిట్‌ జరిగే ప్రాంతం వరకు రహదారికి ఇరువైపులా భారీ డిజిటల్‌ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగరంతోపాటు, రంగారెడ్డి జిల్లాలోని పలు ముఖ్య ప్రాంతాల్లో సమ్మిట్‌ ప్రాధాన్యతను వివరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బ్రోచర్ల తో అవగాహన కల్పించేందుకు వలంటీర్లను సైతం నియమించారు. గ్లోబర్‌ సమ్మిట్‌ లోగోతో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జెండాలు వేడుకల వైభవాన్ని చాటుతున్నాయి.


Read More..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే!

Next Story