తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-08 02:34:12  IST  )

తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ (Telangana Rising Global Summit-2025)కు తెరలేచింది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ (Telangana Rising Global Summit-2025)కు తెరలేచింది. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రముఖ కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఫ్యూచర్ సిటీ (Future City) వేదికైంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఇవాళ మధ్యాహ్నం 1.30కి ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మధ్యాహ్నం 12.30కి ఫ్యూచర్ సిటీ వద్దకు చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం 1:30కు వేడుక ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిషనుదేవ్ సింగ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వేదికపై ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను సీఎం అతిథులకు వివరిస్తారు.

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొనబోతున్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం సీఎం వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు. దేశవిదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలవనున్నారు. ప్రతి 15 నిమిషాలకు వన్-టూ-వన్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి భాగస్వామ్యమవుతారు.

ఇక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి (Kailash Satyarthi), రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా ప్రతినిధులు, టెక్స్‌టైల్, ఫర్నిచర్ తయారీ MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు, విన్‌గ్రూప్ ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి అతిథులతో కలిసి పాల్గొంటారు


Read More..

నేడే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సంరంభం.. తెలంగాణ చరిత్రను చాటేలా ఏర్పాట్లు

Next Story