- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోరాట స్ఫూర్తికి ప్రతీక తెలంగాణ.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరువురు అగ్రనేతలు సామాజిక మాధ్యమాల వేదికగా ‘తెలుగు’లో ట్వీట్ చేయడం విశేషం.
పోరాట స్ఫూర్తికి ప్రతీక తెలంగాణ: ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశంలో తెలంగాణ ప్రజల సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాలను కొనియాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉంది. వికసిత భారత్ అనే మన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలూ, విజయాలూ కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.
దేశ గమనంలో తెలంగాణది కీలక పాత్ర: అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం రాష్ట్ర ప్రజలకు తెలుగులోనే శుభాకాంక్షలు పంచుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశిష్టమైన సంస్కృతి, అద్భుతమైన పారిశ్రామిక నైపుణ్యంతో దేశ గమనంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రాష్ట్రం మరిన్ని ప్రగతి శిఖరాలను అధిరోహిస్తూ, భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత గొప్పస్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జై తెలంగాణ!’ అని తన సందేశంలో పేర్కొన్నారు. జాతీయ నాయకులు ఇద్దరూ తమ సందేశాలను మాతృభాష అయిన తెలుగులో అందించడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






