వర్షాభావ పరిస్థితుల్లో మెట్ట పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి

by Ratna Kumari |

ఎల్‌నినో ప్రభావంతో మెట్ట పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి సూచిస్తూ రూ.4.61 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.

వర్షాభావ పరిస్థితుల్లో మెట్ట పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
X

దిశ, కూసుమంచి : ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలపై మొండిపట్టు వీడి, మారుతున్న ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలను మార్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. అధిక నీటి అవసరం ఉండే పంటల సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ మెట్ట పంటలపై దృష్టి సారించాలని రైతులకు పిలుపునిచ్చారు. శనివారం పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో మంత్రి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రూ.4.61 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

మండల పర్యటనలో భాగంగా మల్లాయిగూడెంలో రూ.2.52 కోట్లతో పెరికసింగారం ఎన్‌ఎస్‌పీ కెనాల్ నుంచి భగవాన్ తండా మీదుగా మల్లాయిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కోక్యా తండాలో రూ.1.69 కోట్లతో లింగారం తండా నుంచి లోక్యా తండా ఎన్‌ఎస్‌పీ కాలువ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అగ్రహారంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి కూడా భూమిపూజ నిర్వహించారు. మొత్తం రూ.4.61 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

177 మంది లబ్ధిదారులకు సంక్షేమ చెక్కుల పంపిణీ..

అనంతరం కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 66 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అలాగే వివిధ అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 111 మంది బాధితులకు రూ.35.16 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను** పంపిణీ చేశారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తోందని చెప్పారు. ఇప్పటికే రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్థిక అండ అందించామని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని రైతులకు సూచించారు. అధిక నీటి అవసరమయ్యే వరి వంటి పంటలకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు, పెసర, మినుము, కంది, నువ్వులు వంటి తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటల సాగును ప్రోత్సహించాలని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పూర్తయిందని, త్వరలో రెండో విడత ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం మూడో, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశామని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు..

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పీఆర్ ఈఈ వెంకట్‌రెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, కూసుమంచి తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో సిలార్ సాహెబ్, మద్దినేని స్వర్ణకుమారి, వివిధ గ్రామాల సర్పంచులు, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీడీసీ చైర్మన్ ఎరబోలు సూర్యనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story