- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలు కురవాలని భక్తి శ్రేద్దలతో మహిళల పూజలు..
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామ ప్రజలు, రైతన్నలు గుండెల్లో గుబులుతో దిగాలు చెందుతున్నారు.

దిశ, మానకొండూరు: ఒకవైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు వర్షాలు లేక పంటపొలాలు బీడువారుతున్నాయి. సాగునీరు దేవుడెరుగు, కనీసం తాగేందుకు బావుల్లో చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. "ఇలాగే కొనసాగితే రేపు మేం బతికేదెలా?" అంటూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామ ప్రజలు, రైతన్నలు గుండెల్లో గుబులుతో దిగాలు చెందుతున్నారు. ఈ కరవు కోరల నుండి ఊరిని రక్షించాలని, వరుణ దేవుడు కరుణించి చెరువులు, కుంటలు నిండాలని ఆ గ్రామ ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో దేవుడిని వేడుకున్నారు.
గ్రామ దేవతలకు జలాభిషేకాలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని కొండపలకల గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీటి బిందెలతో గుడి ప్రాంగణంలో సాంప్రదాయ బతుకమ్మ ఆటలు ఆడి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ పూజారి రఘురామాచార్యులు మరియు శశికాంత్ శర్మ ల ఆధ్వర్యంలో గుడి నుండి తెచ్చిన పవిత్ర జలాలతో ఊరి నడిబొడ్డున ఉన్న బొడ్రాయితో పాటు గ్రామ దేవతలందరికీ ఘనంగా అభిషేకాలు చేశారు. మహిళలందరూ భక్తితో బొడ్రాయికి జలాలను సమర్పించారు. వినూత్నంగా డ్రోన్లతో జలాల స్ప్రే ఈ పూజా కార్యక్రమంలో ఒక సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. 'అయ్యప్ప అగ్రి సొల్యూషన్స్' సంస్థ వారు ఊరిలోని భక్తిభావానికి అండగా నిలిచారు. గ్రామంలోని అన్ని దేవాలయాల గోపురాలపై, పైభాగాలపై డ్రోన్ల సహాయంతో పవిత్ర జలాలను స్ప్రే (చిలకరింపు) చేశారు. టెక్నాలజీని దైవకార్యానికి వాడుతూ చేసిన ఈ వినూత్న ప్రయత్నం గ్రామంలో అందరినీ ఆకట్టుకుంది.
ప్రకృతి కరుణించాలి...
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాడ లక్ష్మి-తిరుపతి రెడ్డితో పాటు ఊరి మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా, టెక్నాలజీ ఎంత పెరిగినా.. ప్రకృతి కరుణించి వానలు పడితేనే జీవకోటికి మనుగడ అని, తక్షణమే వరుణ దేవుడు శాంతించి కరువు తీర్చాలని గ్రామస్థులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.






