రాజమండ్రిని ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-18 11:27:20  IST  )

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి...

రాజమండ్రిని ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
X

దిశ, వెబ్ డెస్క్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం ధాటికి రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన డ్రైనేజీలు, మురుగు కాలువలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. దీంతో మురుగునీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతోంది. వర్షపు నీటితో పాటు మురుగు నీరు కూడా తోడవడంతో కాలనీలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

కంబాల చెరువు, శ్యామల సెంటర్లలో నిలిచిన నీరు

రాజమండ్రిలోని కంబాల చెరువు, శ్యామల సెంటర్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. మోకాళ్లతోతు నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో ఆయా ప్రాంతాల్లో నడిచేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఉన్న గుంతలు నీటి వల్ల కనిపించడంలేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన స్థానికులు ఇళ్లకు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దీంతో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. నీటిని, డ్రైనేజీలను క్లియర్ చేస్తున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరిక

అల్పపీడన ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో రాబోయే 24 నుండి 48 గంటల్లో ఏపీవ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.

Next Story