- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెబ్బెన్ లో జరిగిన హత్య కేసు ఛేదన
రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన మాసడే సోమయ్య (65) హత్య కేసును పోలీసులు ఛేదించారు.

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన మాసడే సోమయ్య (65) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడకు చెందిన బొంగారపు నాగేష్ (40) ను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు రెబ్బెన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మాసడే సోమయ్య తన కుమార్తెను రైలులో ఎక్కించి తిరిగి వస్తుండగా టీ తాగేందుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో బొంగారపు నాగేష్ డబ్బులు అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, ఆగ్రహానికి గురైన నాగేష్ గొడ్డలితో దాడి చేసి సోమయ్యను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నిఖితా పంత్ ఆదేశాల మేరకు, ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు సందర్భంగా సిర్పూర్ రైల్వే స్టేషన్ వద్ద బల్లార్షా వైపు వెళ్లి తిరిగి వస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ హత్య కేసును ఛేదించినట్లు రెబ్బెన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ తెలిపారు. నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసు ఛేదనకు సంబంధించిన వివరాలను శనివారం రెబ్బెన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ వెల్లడించారు. సమావేశంలో రెబ్బెన ఎస్‌ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు.






