- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ వివస్త్ర ఘటన: ఎమ్మెల్యేపై అంబటి సంచలన ఆరోపణలు
గుంటూరులో జరిగిన మహిళ వివస్త్ర ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం వార్డు సభ్యుడు మూర్తిని కాపాడేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు....

దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో జరిగిన మహిళ వివస్త్ర ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం వార్డు సభ్యుడు మూర్తిని కాపాడేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి కాపాడే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. వార్డుల్లో ప్రజల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 15వ తేదీన ఘటన జరిగితే కేసు జాప్యానికి కారణం స్తానిక ఎమ్మెల్యేనని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. డబ్బులతో వచ్చిన గొడవ కాదని ధ్వజమెత్తారు. బాధితులతో రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళను వివస్త్రను చేస్తే హోంమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సామాన్య మహిళకు, టీడీపీ నేతకు మధ్య గొడవ జరిగితే పోలీసులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. రాజధానికి కూతవేటు దూరంలో మహిళపై దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను వివస్త్రను చేస్తే రెండు రోజులుగా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం చేశారు..
తాము పరామర్శిస్తామనే నేపథ్యంలో సీఎం చంద్రబాబు మేల్కొన్నారన్నారు. ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం చేశారని, అందువల్ల కేసు నమోదు చేయలేదన్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లే పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. బాధితులతో రాజీ చేసి కేసును మసి పూసి మారేడు కాయ చేద్దామనుకున్నారని అంబటి ఆరోపించారు. మల్లెల మూర్తిని సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. డబ్బుల కలెక్షన్ వల్లే ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని అంబటి రాంబాబు ఆరోపించారు. మల్లెల మూర్తిని ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం చేశారని అంబటి వ్యాఖ్యానించారు. ఘటన వెలుగులోకి రాకుండా చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో అప్పుడు నిందితుడిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నడిబజారులో సంఘటన జరిగితే హోంమంత్రి ఏం చేస్తున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.






