- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల దీవెనలే మాకు బలం: సీఎం రేవంత్‌రెడ్డి
మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వ బలమని.. మహిళల మద్దతుతోనే 2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వ బలమని.. మహిళల మద్దతుతోనే 2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని.. త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలను శిక్షణ, మార్కెటింగ్, వ్యాపారానికి కేంద్రంగా పనిచేసేలా కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నామని తెలిపారు. హైటెక్ సిటీ ప్రాంతంలో శిల్పారామానికి ఆనుకుని రూ.1,000 కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ నిర్వహించడానికి కేటాయించినట్లు చెప్పారు.
ప్రత్యేక సదుపాయంలో, గ్రామీణ హస్తకళలు, సాంప్రదాయ ఉత్పత్తులను విక్రయించడానికి మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రత్యేకంగా కేటాయించిన 150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. అదే స్ఫూర్తితో మహిళా సాధికారత కోసం ఫిక్కీ అభ్యర్థనలను అత్యంత ప్రాముఖ్యతతో నెరవేరుస్తామని.. ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హైటెక్ సిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ కార్యాలయం ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని తెలిపారు. దీంతోపాటు ఫిక్కీని ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామిని చేసే ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తామన్నారు.
రానున్న రోజుల్లో ప్రపంచ అగ్రగామి ఫార్చ్యూన్-500 కంపెనీలనన్నింటినీ ఫ్యూచర్ సిటీలో నెలకొల్పాలన్నది తమ లక్ష్యమని.. దీంట్లో ఫిక్కీతోపాటు మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం కానుందని తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం, 2027లో ఫిక్కీ 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని.. వారితో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సోనియా గాంధీ 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటివరకు అది అమలు కాలేదని.. వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ఎఫ్ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజా గర్గ్, హైదరాబాద్ చైర్‌పర్సన్ సీతారెడ్డి గడ్డం సహా మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.






