ఓటరు జాబితా సవరణలో బీజేపీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలి: కిషన్ రెడ్డి

by Kodari Anjali |

ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఓటరు జాబితా సవరణలో బీజేపీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలి: కిషన్ రెడ్డి
X

దిశ, సికింద్రాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మహంకాళి–సికింద్రాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా వెన్నెముక వంటిదని, బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, ఇతర సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించిన ఆయన, విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరిగిందన్నారు.

రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని వివరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story