- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర విద్యాశాఖలో సంచలనం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో పరిపాలనా లోపాలు, విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థుల నమోదు పూర్తిగా తగ్గిపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం మరో నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది.

దిశ, సూర్యాపేట/తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో పరిపాలనా లోపాలు, విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థుల నమోదు పూర్తిగా తగ్గిపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం మరో నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) అశోక్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు (ఎఫ్‌ఏసీ) ఎం.డి. హకీమ్ ను జూలై 15న సస్పెండ్ చేయగా, తాజాగా మరో నలుగురు ఉపాధ్యాయులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. దీంతో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ సస్పెన్షన్‌కు గురికావడం రాష్ట్ర విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.
సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులు..
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ అయిన వారు పి. కోటయ్య – స్కూల్ అసిస్టెంట్ (గణితం), కె. సుజాత – స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), జి. గీత – స్కూల్ అసిస్టెంట్ (బయోసైన్స్), కె.శ్రీనివాస్ నాయుడు – ఎస్‌జీటీ,
విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు..
పాఠశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ నిర్వహించిన విచారణలో పలు కీలక అంశాలు బయటపడ్డాయని డీఈఓ తెలిపారు. గ్రామంలో పాఠశాల వయస్సు గల విద్యార్థులు ఉన్నప్పటికీ హైస్కూల్ విభాగంలో విద్యార్థుల నమోదు పూర్తిగా సున్నాకు (జీరో ఎన్‌రోల్‌మెంట్) చేరడం. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేవని తప్పుడు ప్రచారం చేసి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లలో చేర్పించేలా ప్రోత్సహించడం. ఉపాధ్యాయుల మధ్య తీవ్ర విభేదాలు, సమన్వయ లోపం కారణంగా విద్యా వాతావరణం దెబ్బతినడం. పాఠశాల రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం. పాఠశాల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.
విచారణ కొనసాగుతోంది..
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల నమోదు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ చర్యలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు హెచ్చరికగా నిలుస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి పేర్కొన్నారు.






