వృద్ధురాలి అనుమానాస్పద మృతిపై హత్య కేసు నమోదు

by Ratna Kumari |

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో కలకలం రేపిన వృద్ధురాలు చెన్నా సుగుణమ్మ (60) అనుమానాస్పద మృతిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వృద్ధురాలి అనుమానాస్పద మృతిపై హత్య కేసు నమోదు
X

దిశ, తిరుమలాయపాలెం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో కలకలం రేపిన వృద్ధురాలు చెన్నా సుగుణమ్మ (60) అనుమానాస్పద మృతిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన చెన్నా జనార్ధన్–సుగుణమ్మ దంపతులు గ్రామ శివారులో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారి సమీపంలోని తమ ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల జనార్ధన్ పక్షవాతానికి గురికావడంతో సుగుణమ్మ ఆయనకు సేవలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం సుగుణమ్మ ఇంట్లోనే రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించింది. ఆమె మెడ భాగంలో బలమైన గాయాలు ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహంపై కారం చల్లిన ఆనవాళ్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పక్షవాతంతో బాధపడుతున్న భర్త జనార్ధన్ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో ఘటనకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. దీంతో ఈ హత్యను ఎవరు, ఏ కారణంతో చేశారు అనే దానిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ సంజీవ్ పరిశీలించారు. క్లూస్ టీం, ఫింగర్‌ప్రింట్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. బంగారు ఆభరణాల కోసం హత్య జరిగిందా? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అనుమానితుల ఫింగర్‌ప్రింట్ నమూనాలను కూడా సేకరించి పరిశీలిస్తున్నారు. మృతురాలి కుమారుడు తిరుమలరావు ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story