- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా మెగా యాక్షన్.. రూ.30 వేల కోట్ల ప్రభుత్వ భూమి కాపాడింది
నగరం నలువైపులా శనివారం హైడ్రా భారీ ఆపరేషన్లను నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరం నలువైపులా శనివారం హైడ్రా భారీ ఆపరేషన్లను నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వీటి విలువ రూ. 30 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా ఈ భారీ ఆపరేషన్లను నిర్వహించింది. తప్పుడు పత్రాలతో, సర్వే నంబర్లతో వందల ఎకరాలు కాజేయాలని చేస్తున్న వారి ప్రయత్నాలకు హైడ్రా శనివారం చెక్ పెట్టింది. ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని 25, 26 సర్వే నంబర్లలో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇదే జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మేడ్చల్ - మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని కంటోన్మెంట్ 106 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం విలేజ్‌లోని సర్వే నంబరు 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసింది. ఇలా మొత్తం 840 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం హైడ్రా కాపాడింది.
అరెకరం కొని.. ప్రభుత్వ భూమిలోకి జరిగి..
రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా కొండలు, గుట్టలు, పచ్చని చెట్లతో సహజ సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూమిని కాజేయాలని చాలామంది ప్రయత్నం చేస్తుండగా.. ఆ భూమికి శనివారం ఫెన్సింగ్ వేసింది. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో టి.హబ్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూమికి ఆనుకుని ఉన్న ప్రైవేటు పట్టాకు చెందిన అర ఎకరం భూమిని ఓ సంస్థకు ఆ స్థల యజమాని అమ్మారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కూడా తక్కువ ధరకు అమ్మేయ్ నేను కొనేస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా సర్వే నంబరు 46లోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి చొరబడి ఎకరం భూమి వరకూ కాజేశారు. రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. గుట్టలు, కొండల మాటున గుట్టుగా కబ్జాల పర్వం కొనసాగించాలనుకునే వారికి రెవెన్యూ, హైడ్రా అధికారులు చెక్ పెట్టారు. ఎకరం రూ. 200ల కోట్ల వరకూ ఉండే ఈ భూమి కబ్జాలకు ఆస్కారం లేకుండా చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
వణ్యప్రాణులకు ముప్పుగా ఆక్రమణలు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మేడ్చల్ - మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాదారులు వాటాలేసుకుని కాజేయాలని ప్రయత్నించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో గల జీఎల్ ఆర్( జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వేరే సర్వే నంబర్లతో ఎంటర్ అయి ఏకంగా లే ఔట్ వేసేశారు. అక్కడ పర్యావరణానికి తూట్లు పొడుస్తూ సహజసిద్ధంగా ఉన్న కొండలను పేల్చుతూ వణ్యప్రాణుల మనుగడకు భంగం కలిగించారు. చిట్టి అడివిని తలపించే విధంగా ఉన్న పచ్చని గుట్టల్లో నెమళ్లు భయంతో నివాస ప్రాంతాల్లోకి ఎగిరి వెళ్లే విధంగా అక్కడ కొండలను పేల్చిన ఘటనలపై స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పలు నిర్మాణ సంస్థలు లే ఔట్‌లు వేసి ప్లాట్లుగా విక్రయించడానికి చేసిన ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. ప్రికాస్ట్ ఇటుకలతో ప్రహరీలు నిర్మించి ఆక్రమణల పర్వానికి తెరలేపగా.. వాటిని తొలగించి 106 ఎకరాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. దీంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పెద్దయెత్తున హైడ్రాకు మద్ధతుగా ర్యాలీలు తీశారు. టపాసులు పేల్చి హైడ్రా జిందాబాద్ అంటూ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వ భూమిని వ్యవసాయ భూమిగా..
రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలోని శంషాబాద్ విమానాశ్రయ రన్‌వేకు దక్షిణ భాగంలో ఉన్న 650 ఎకరాల భూమికి ఆనుకుని ఓ ఆర్ ఆర్ కూడా ఉండడంతో ఈ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. అంతే రైతుల దగ్గర రూ. లక్షల్లో కొనేసి.. రూ. కోట్ల విలువైన భూమిని కాజేయాలని ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే చాలామంది రైతులు అమ్ముకుని వెళ్లిపోయారు. 1954 ఖాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్లు 25, 26లో ఉన్న 650 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డులు చెబుతున్నాయి. 2002–2006లో అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో “ఎంజాయ్‌మెంట్ సర్వే” నిర్వహించి, భూముల ఆక్రమణలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చే ప్రయత్నం చేశారు. క్రమబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం వద్దకు పంపినా, 2006లో సీసీఎల్ఏ తిరస్కరించింది. అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో భూముల కేటాయింపుపై నిషేధం ఉందని పేర్కొంది. దీంతో క్రమబద్ధీకరణ అంశం పూర్తిగా ముగిసిన అంశంగా రికార్డులకెక్కింది. ప్రస్తుతం కూడా ప్రభుత్వం తమదిగా పేర్కొంటున్న భూముల్లో గ్రామస్తులతో పాటు.. పలువురు ఫామ్ హౌస్‌లు కట్టుకుని వ్యవసాయం చేస్తూ కొనసాగుతున్నారు. ఈ మేరకు వారిని ఖాళీ చేయించి ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా కాపాడింది.






