- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగంపల్లి చిన్నారి కిడ్నాప్ కేసులో కొత్త కోణం
లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసును చందానగర్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.

దిశ, శేరిలింగంపల్లి: లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసును చందానగర్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. అక్రమ దత్తతల పేరుతో చిన్నారులను అమ్మే ముఠాలోని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన గోవిందమ్మ తన మూడేళ్ల కుమార్తె పుష్పరాణితో కలిసి జూలై 15 రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్-6 సమీపంలోని భవానీ హోటల్ ముందు ఫుట్‌పాత్‌పై నిద్రించింది. జూలై 16 తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
నవజాత శిశువుల వివరాలు సేకరించి..
సైబరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు కొత్తి శ్రీనివాస్, దోమ రామకృష్ణ, పలాది నవనీతలను గుర్తించి అరెస్ట్ చేశారు. చిన్నారిని కొనుగోలుదారుడికి అప్పగించే ఏర్పాట్లు జరుగుతుండగానే దాడి చేసి పాపను సురక్షితంగా రక్షించారు. దర్యాప్తులో అక్రమ దత్తతల పేరుతో బాలల అక్రమ రవాణా నెట్‌వర్క్ వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో పనిచేస్తున్న నవనీత, సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రుల ద్వారా గర్భిణులు, నవజాత శిశువుల వివరాలు సేకరించి అక్రమ దత్తతలకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. రెండు లక్షల రూపాయలకు చిన్నారిని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తు ప్రణాళిక ప్రకారం, లింగంపల్లి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం, ఆర్థిక లావాదేవీలు, అక్రమ దత్తతల నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తెలిపారు.






