- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడవా : సీపీఎం
గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో నిర్మించిన భారీ ప్రాజెక్టుల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ప్రజలను, రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయని సీపీఎం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, మహదేవపూర్ : గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో నిర్మించిన భారీ ప్రాజెక్టుల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ప్రజలను, రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయని సీపీఎం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. శనివారం సీపీఎం ప్రతినిధి బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడి వాస్తవ పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు అందరి అభిప్రాయాలను, సాంకేతిక నివేదికలను పరిగణనలోకి తీసుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా పనులు చేయాలి. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం గానీ, అంతకుముందున్న వైఎస్‌ఆర్ ప్రభుత్వం గానీ సొంత, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పై దాదాపు లక్ష కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు పెట్టినా, నేడు దాన్ని ఏ విధంగా వినియోగించాలనే దాని పై ప్రభుత్వాలకు స్పష్టత లేదు అని వారు విమర్శించారు.
మూడేళ్లుగా కాలయాపన.. నష్టానికి బాధ్యులెవరు ?
మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం, గేట్లు దెబ్బతినడం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికలను సాకుగా చూపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని నేతలు ఆరోపించారు. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి, అసలు దీనిపై ఏం చేయదలుచుకున్నారు, దెబ్బతిన్న బ్యారేజీలకు మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తారా.. లేక ప్రత్యామ్నాయాలు చూస్తారా అనే విషయాల పై ప్రభుత్వం స్పందించడం లేదు అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నివేదికలు ఇచ్చి ప్రేక్షక పాత్ర వహిస్తోందని, ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.
అన్నారం, కన్నెపల్లి ద్వారా నీటిని తరలించాలి..
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో తాగునీరు, సాగునీరు లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానదిలో నీరు లేకపోయినా, గోదావరిలో గత 15–20 రోజుల్లోనే సుమారు 120 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయిందని గుర్తుచేశారు. మేము క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాని ప్రకారం ప్రస్తుతం గోదావరిలో 16 వేల నుంచి 18 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద పంపులు పనిచేసే స్థితిలోనే ఉన్నాయి. అక్కడి నుంచి రోజుకు రెండు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజీకి తరలించి, అక్కడి నుంచి తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి అందించే అవకాశం ఉంది. బ్యారేజీ పరిస్థితి బాగోలేదని వంకలు చెప్పకుండా, ప్రయోగాత్మకంగా నీటిని నింపితేనే ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అని స్పష్టం చేశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోతే భారీ ఉద్యమం..
ప్రాజెక్టులు ఎవరు నిర్మించినా అది ప్రజల సొమ్మేనని, అందువల్ల అందుబాటులో ఉన్న వనరులను తక్షణమే రైతాంగం కోసం ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అనుమతులు సాధించాలని సూచించారు. నీటిని వినియోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు, ప్రజాసంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.






