బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-18 12:56:43  IST  )

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది.

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్వహిస్తున్న ఒక పటాకుల తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ధాటికి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రామోల్-గాత్రాడ్ రోడ్ కెనాల్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో నడుస్తున్న యూనిట్‌లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మొదట ఇద్దరు మాత్రమే మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

లైసెన్స్ రద్దయినా ఆగని తయారీ..

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఎల్జీ, సివిల్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఫ్యాక్టరీని మేహుల్ దొడియా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు ఫ్యాక్టరీ లైసెన్స్‌ను అధికారులు ఇదివరకే రద్దు చేసినప్పటికీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా పటాకుల తయారీ సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయని, పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కాగా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను పరిశీలించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందాలతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలను కూడా ఘటనా స్థలానికి రప్పించి విచారణ జరుపుతున్నారు.

ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు కేంద్రప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేసింది.



Next Story