సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌కు నిరసనగా హుజరాబాద్‌లో ప్రజాసంఘాల జేఏసీ ధర్నా

by Kodari Anjali |

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఖండిస్తూ హుజరాబాద్‌లో ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌కు నిరసనగా హుజరాబాద్‌లో ప్రజాసంఘాల జేఏసీ ధర్నా
X

దిశ,​ హుజరాబాద్ రూరల్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఖండిస్తూ హుజరాబాద్‌లో ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ​ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా గత 21 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ శాంతియుత మార్గంలో నిరాహార దీక్ష చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అక్రమంగా అరెస్ట్ చేయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేంద్రం ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

​విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి...

​దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. నిరంతరం కష్టపడి చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇటువంటి లీకేజీల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.​ఈ భారీ కుంభకోణంపై దేశ ప్రధానమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని, ఉన్నత స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. తద్వారా బాధ్యులను కఠినంగా శిక్షించి, విద్యార్థులకు న్యాయం చేయాలని జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story