బస్సు ఢీకొని ఐదు నెలల గర్భిణి మృతి..

by Batti.Sumithra |

ఆ దంపతుల ఐదేళ్ల నిరీక్షణ.. త్వరలోనే తమ ఇంట్లో పసి పాదం మోపబోతుందని ఆశగా ఎదురు చూశారు.

బస్సు ఢీకొని ఐదు నెలల గర్భిణి మృతి..
X

దిశ, అలంపూర్ : ఆ దంపతుల ఐదేళ్ల నిరీక్షణ.. త్వరలోనే తమ ఇంట్లో పసి పాదం మోపబోతుందని ఆశగా ఎదురు చూశారు. ఐదు నెలల గర్భంతో ఉన్న ఆ తల్లి, పుట్టబోయే బిడ్డ కోసం వందల కలలు కంది. కానీ, ఆ కలలన్నీ జాతీయ రహదారిపై నెత్తుటి చారికలుగా మారిపోతాయని ఆ కుటుంబం ఊహించలేదు. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఆ గర్భిణిని కబలించింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన చాకలి ప్రియాంకకు 2021లో నంద్యాల జిల్లా మిడివేముల గ్రామానికి చెందిన చాకలి చిన్నబజారుతో వివాహమైంది. పెళ్లైన ఐదేళ్ల వరకు పిల్లలు కలగకపోవడంతో ఎన్నో నోములు నోచారు, పూజలు చేశారు. ఎట్టకేలకు ఆమె గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఐదు నెలలు నిండడంతో సంప్రదాయం ప్రకారం భర్త ఇంట్లో సాంప్రదాయ పద్ధతిలో నిద్ర ముగించుకుని, ప్రసవం కోసం పుట్టింటికి బయలుదేరింది. కన్నకూతురిని బైక్‌ పై జాగ్రత్తగా తీసుకొస్తున్న తండ్రి చాకలి రాముడు కళ్లముందే మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. 44వ జాతీయ రహదారిపై పుల్లూరు స్టేజీ సమీపంలో ఏపీ రాష్ట్రానికి చెందిన అనంతపురం డిపో బస్సు ఢీ కొనడంతో ప్రియాంక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చాకలి రాముడికి గాయాలు కావడంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు టైరు ఆమె తలపై నుంచి వెళ్లడంతో ఆ దృశ్యం చూసిన వారు తట్టుకోలేకపోయారు. భర్తకు ఆనందాన్ని, తండ్రికి గర్వాన్ని ఇవ్వాల్సిన ఆ గర్భిణీ.. కడుపులోని బిడ్డతో సహా కాలగర్భంలో కలిసిపోవడం అందరినీ కన్నీరు పెట్టించింది. ఇలాంటి విషాద ఘటన మునుపెన్నడూ ఈ రహదారిపై కనిపించలేదు.

ఆ ఇంట్లో వెలిగిన ఒకే ఒక్క ఆశల దీపం... విధి ఆర్పేసింది !

ఆ తండ్రికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు, చిన్న కూతురు ఇద్దరికీ మతిస్థిమితం లేదు. కళ్లముందే లోకం తెలియకుండా పడి ఉండే ఆ ఇద్దరిని చూసి ఆ తండ్రి గుండె నిత్యం రగిలిపోయేది. కానీ, రెండో కూతురు చాకలి ప్రియాంక మాత్రం చిన్నప్పటి నుంచి ఎంతో హుషారుగా ఉంటూ, ఆ తండ్రి గుండెకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ఒక్క కూతురికైనా పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయాలని 2021లో నంద్యాల జిల్లా మిడివేముల గ్రామానికి చెందిన చిన్నబజారుతో వివాహం జరిపించాడు. పెళ్లైన ఐదేళ్లకు ఆమె గర్భం దాల్చడంతో తన ఇంట్లో కూడా సంతోషం పూస్తుందని ఆ తండ్రి రాముడు ఆశపడ్డాడు. కానీ, విధి ఆ ఒక్క ఆశల దీపాన్ని కూడా దారుణంగా ఆర్పేసింది. తన కళ్ల ముందే బస్సు రూపంలో చాకలి ప్రియాంకను మృత్యువు కబలించింది.

Next Story