SEBI: 'బాస్ స్కామ్' సైబర్ మోసాలపై లిస్టెడ్ కంపెనీలకు సెబీ అలర్ట్

by S Gopi |

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా సెబీ ఈ కీలక అడ్వైజరీ జారీ చేసింది.

SEBI: బాస్ స్కామ్ సైబర్ మోసాలపై లిస్టెడ్ కంపెనీలకు సెబీ అలర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ సంస్థలే లక్ష్యంగా 'బాస్ స్కామ్' పేరుతో వేగంగా పెరుగుతున్న కొత్త సైబర్ మోసంపై సెబీ అప్రమత్తమైంది. దీనికి సంబంధించి లిస్టెడ్ కంపెనీలు, నియంత్రిత సంస్థలను అలర్ట్ చేసింది. కంపెనీల సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ) లేదా ఇతర సీనియర్ అధికారులుగా నటిస్తూ ఫైనాన్స్, అకౌంట్స్ బృందాలను బురిడీ కొట్టించి కోట్లాది రూపాయల నిధులను కాజేసే ఈ ముఠాల పట్ల మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ' అన్ని లిస్టెడ్ కంపెనీలను హెచ్చరిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా సెబీ ఈ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ మోసంలో నేరగాళ్లు కేవలం ఈమెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మెసేజ్‌లు పంపడమే కాకుండా, తాము నిజమైన అధికారులమే అని నమ్మించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా లేదా ఈమెయిల్స్ ద్వారా వచ్చే నిధుల బదిలీ రిక్వెస్ట్‌లను బ్లైండ్‌గా నమ్మవద్దని, సదరు సీనియర్ అధికారికి నేరుగా ఫోన్ చేసి స్వయంగా వెరిఫై చేసుకోవాలని సెబీ స్పష్టం చేసింది. ఒకవేళ ఇలాంటి మోసాలు జరిగితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ '1930'కి లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది.

Next Story