ముట్టుకోకుండానే చుట్టుకుంటాయి..! సెల్ఫ్ డ్రెస్సింగ్ సూపర్ క్లాతింగ్‌

by Javid Pasha |   (  Updated:2026-07-18 12:52:20  IST  )

ధరించేటప్పుడు వాటంతట అవే శరీరాన్ని చుట్టుకోగల దుస్తులను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

ముట్టుకోకుండానే చుట్టుకుంటాయి..! సెల్ఫ్ డ్రెస్సింగ్ సూపర్ క్లాతింగ్‌
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత అనేక రకాలుగా, అనేక రంగాలకు విస్తరిస్తోంది. అయితే రీసెంట్‌గా KAIST (కొరియా) & స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక అద్భుతమైన టెక్నాలజీని డెవలప్ చేశారు. ఏంటంటే.. ధరించేటప్పుడు వాటిని చేతులతో పట్టుకోకుండానే, ఎవరి సహాయం లేకుండానే వాటంతట అవే శరీరాన్ని చుట్టుకోగల దుస్తులను వారు అభివృద్ధి చేశారు. వీటిని సెల్ఫ్ డ్రెస్సింగ్ క్లాతింగ్ అని పిలుస్తున్నారు. ఇవి మృదువైన, గాలి ద్వారా నడిచే వైన్ రోబోట్స్ (పాములాంటి రోబోలు) ఫ్యాబ్రిక్‌లో ఎంబెడ్ చేయబడి ఉంటాయి.

ఎలా పని చేస్తాయి?

సెల్ఫ్ డ్రెస్సింగ్ క్లాతింగ్‌లో అమర్చబడిన రోబోలు ఎక్కడో ఒక మూల నుంచి పెరిగే ఐవీ మొక్కలను అనుసరించి రూపొందించారు. ఇవి చివరి నుంచి పెరుగుతూ, ధరించేవారి శరీరం మీదుగా దుస్తులను మార్గనిర్దేశం చేస్తాయి. వ్యక్తి కదులుతున్నప్పుడు కూడా ఇవి పని చేస్తాయి. ఈ టెక్నాలజీ కలిగిన పూర్తి సూట్‌ను సుమారు 10 సెకన్లలో ధరించవచ్చు. కాంప్లెక్స్ ఏఐ కంట్రోల్స్ ఏమీ లేవు, పూర్తిగా నిశ్చలంగా నిలబడాల్సిన అవసరం కూడా లేదు.

ఎవరికి ఉపయోగం?

క్యూరియాసిటీని పెంచుతున్న ఈ సెల్ఫ్ డ్రెస్సింగ్ టెక్నాలజీ క్లాతింగ్‌ను వృద్ధులు, వికలాంగులు, క్లీన్‌రూమ్ వర్కర్లు, అగ్నిమాపక సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్పాండర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వాటిని తయారు చేసిన పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సాంకేతికతను ఉపయోగించడంవల్ల విపత్కర పరిస్థితుల్లోనూ రక్షణాత్మక దుస్తులను త్వరగా ధరించడం సాధ్యపడుతుంది. ఈ క్లాతింగ్ టెక్నాలజీ భవిష్యత్‌లో, రోజువారీ జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చునని నిపుణులు అంటున్నారు.

Next Story