రైలులో ఆకతాయికి వింత శిక్ష.. గాజులు వేసి, లిప్‌స్టిక్ పూసిన యువతి వైరల్

by Ramesh Naini |

మహారాష్ట్రలోని ఓ ప్యాసింజర్ రైలులో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఓ యువతి వింత శిక్ష వేసింది.

రైలులో ఆకతాయికి వింత శిక్ష.. గాజులు వేసి, లిప్‌స్టిక్ పూసిన యువతి వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని ఓ ప్యాసింజర్ రైలులో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఓ యువతి వింత శిక్ష వేసింది. సహ ప్రయాణికుల సాయంతో అతడికి గాజులు తొడిగి, లిప్‌స్టిక్ పూసి అవమానించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారితీసింది.

అసలేం జరిగిందంటే..?

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. భూసావళ్–వర్ధా (లేదా బడ్నేరా-అకోలా) ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన సదరు యువతి, తోటి ప్రయాణికుల సాయంతో అతడిని పట్టుకుంది. అనంతరం అతడి చేతులకు గాజులు వేసి, పెదాలకు లిప్‌స్టిక్, ముఖానికి మేకప్ వేసి బహిరంగంగా శిక్షించింది. ప్రయాణికులంతా చూస్తుండగానే జరిగిన ఈ ఘటనలో సదరు యువకుడు మౌనంగా ఉండిపోవడం వీడియోలో కనిపించింది.

నెట్టింట భిన్నాభిప్రాయాలు..

ఈ ఘటనపై సోషల్ మీడియాలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. వేధింపులను మౌనంగా భరించకుండా యువతి ధైర్యంగా ఎదిరించడాన్ని, తోటి ప్రయాణికులు ఆమెకు అండగా నిలవడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇది మహిళల భద్రతకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందని సమర్థిస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు ఈ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎలాంటి పోలీసు ఫిర్యాదు లేదా ఎఫ్ఐఆర్ లేకుండా, అసలు నేరం రుజువు కాకుండానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలా బహిరంగంగా శిక్షించడం సరికాదని ప్రశ్నిస్తున్నారు. వీడియో తీస్తున్న సమయంలో మహిళలు దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం గురించి మాట్లాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం సోషల్ మీడియా అటెన్షన్ కోసమే ఒక వ్యక్తికి కనీస విచారణ లేకుండా శిక్ష వేశారని మండిపడుతున్నారు.

Next Story