వేదికపైకి అనుమతి నిరాకరణ.. సర్పంచుల ఆగ్రహం

by Taduka Kalyani |

తాండూర్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలోని జీపీఆర్ గార్డెన్‌లో నిర్వహించారు.

వేదికపైకి అనుమతి నిరాకరణ.. సర్పంచుల ఆగ్రహం
X

దిశ, పెద్దేముల్: తాండూర్ నియోజకవర్గంలో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనుల శంకుస్థాపనతో పాటు, తాండూర్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలోని జీపీఆర్ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు హాజరయ్యారు. అయితే సభా వేదిక పైకి స్థానిక సర్పంచ్ భూమే యాదమ్మ, మారేపల్లి సర్పంచ్ సునీతా, తింసాన్ పల్లి సర్పంచ్ చంద్రకళ, గోపాల్ పూర్ సర్పంచ్ మంజుల ఖానాపూర్ సర్పంచ్ సాయమ్మ, చైతన్యనగర్ సర్పంచ్ గౌరమ్మ తో పాటు పెద్దేముల్ మండలంలోని పలువురు సర్పంచులు, సర్పంచుల సంఘం ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులు, పలువురు తాండూర్ కౌన్సిలర్లను అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వేదికపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రజాప్రతినిధులకే వేదికపైకి అనుమతి నిరాకరించడం సరైన విధానం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని సర్పంచులు వేదిక కిందే వేచి చూడాల్సి వచ్చింది.

Next Story