ఒక్క‘బజ్’తో 30 నిమిషాల ఏకాగ్రత అవుట్.. ఆ నోటిఫికేషన్లతో జాగ్రత్త!

by Javid Pasha |

ఫోన్ నోటిఫికేషన్ రాగానే మన మెదడులో డొపమైన్ అనే హార్మోన్‌ను రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత జరిగేది ఏమిటంటే..

ఒక్క‘బజ్’తో 30 నిమిషాల ఏకాగ్రత అవుట్.. ఆ నోటిఫికేషన్లతో జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : ఫోన్ నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎక్కడికెళ్లినా మన వెంటనే తీసుకెళ్తుంటాం. ఎప్పుడూ జేబులోనో, బ్యాగులోనో, పర్సులోనో పెట్టుకొనే ఉంటాం. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్న పక్కనే పెట్టుకుంటాం. టింగు మని మెసేజ్ సౌండ్ వచ్చినా.. చిన్నగా బజ్ అయినా ఠక్కున స్క్రోల్ చేస్తుంటాం. ఇదంతా సాధారణమే. కానీ ఇది చాలా వరకు మన ఏకాగ్రతను దెబ్బతీస్తుందని, మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? నిపుణులు అదే చెబుతున్నారు.

జస్ట్ వన్స్ బజ్ అయినా లేదా వైబ్రేట్ అయితే చాలు.. ఎంత బిజీలో ఉన్నా.. ఏ పనిచేస్తున్నా ఫోన్ మన ఏకాగ్రతను తక్షణం భంగపరుస్తుంది. అయితే ఈ “అటెన్షన్ స్విచ్” మన మెదడులోని ఎక్జిక్యూటివ్ ఫంక్షన్స్‌ను అంటే.. నిర్ణయాలు తీసుకోవడం, దృష్టి కేంద్రీకరించడం వంటి వాటిని ఆకస్మికంగా మార్చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం.. ఒక ఫోన్‌లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి ఏకాగ్రతకు తిరిగి రావడానికి 20 నుంచి 30 నిమిషాలు కూడా పట్టవచ్చు. ఇంతలో మళ్లీ మరో నోటిఫికేషన్ వస్తే ఈ ప్రాసెస్ మళ్లీ మొదటికొస్తుంది. అంటే.. ఒక్క రోజులో డజన్ల కొద్దీ ఇలాంటి అంతరాయాలు ఏర్పడుతూ ఉంటే.. ఆ ప్రభావం మీరు చేస్తున్న పనిలో ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

మెదడుపై ప్రభావం?

వాస్తవానికి మానవ మెదడు అనేక పనులను ఒకేసారి(మల్టీటాస్కింగ్) చేయడానికి అనుగుణంగా రూపొందలేదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మెదడు దానిని “తక్షణ ముఖ్యమైన సమాచారం”(potentially important information)గా భావించి డొపమైన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒక రకమైన చిన్న “రివార్డ్” లాంటిది. కానీ ఈ ఆకర్షణ వల్ల ఆ క్షణంలో చేస్తున్న ముఖ్యమైన పని నుంచి దృష్టి మళ్లిపోతుందని, ఫలితంగా ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆలోచనా సామర్థ్యం, పనిలో నాణ్యత కూడా తగ్గుతుందని అంటున్నారు. దీర్ఘకాలంలో ఇలాంటి అంతరాయాలు ఆందోళన, డిప్రెషన్ స్థాయిలను కూడా పెంచవచ్చునని చెబుతున్నారు.

సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎలా మేనేజ్ చేస్తారు?

ఈ రోజుల్లో ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేసుకుంటే.. ముఖ్యమైన సమాచారాన్ని లేదా అవకాశాన్ని కోల్పోతామనే భావన అందరిలో ఉంది. పైగా ప్రస్తుతం పనివిధానాలు, ఉద్యోగాలు ఇందుకు అనుగుణంగానే ఉంటున్నాయి. సోషల్ మీడియా వినియోగం, ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయాల్సి రావడం వంటివి ఫోన్ వాడకాన్ని, నోటిఫికేషన్లను ఆఫ్ చేయకుండా ఉండటాన్ని అనివార్యం చేస్తున్నాయి. అయినప్పటికీ వాటివల్ల ఏకాగ్రత దెబ్బతినడం అనే నష్టం మాత్రం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే సక్సెస్ ఫుల్ పీపుల్ వీటికి దూరంగా ఉంటారని చెబుతున్నారు.

మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. సక్సెస్‌ఫుల్ పర్సన్స్, రచయితలు, ప్రోగ్రామర్లు, ఎగ్జిక్యూటివ్‌లు చాలా వరకు తమ పనివేళల్లో నాన్-ఎసెన్షియల్ నోటిఫికేషన్లను పూర్తిగా ఆఫ్ చేసి ఉంచుతారు. కొందరు “డీప్ వర్క్” సెషన్లు (2-4 గంటలు) ఏర్పాటు చేసుకొని ఫోన్‌ను వేరే గదిలో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల దృష్టి స్థిరంగా ఉంటుందని, సృజనాత్మకత పెరుగుతుందని, పని త్వరగా, నాణ్యతగా పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తక్కువ ఒత్తిడితో ఎక్కువ ప్రొడక్టివిటీ సాధించడం సాధ్యం అవుతుందని అంటున్నారు.

ఏం చేయాలి?

*ఫోన్ నోటిఫికేషన్లు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయని భావించినప్పుడు పని సమయంలో “డూ నాట్ డిస్టర్బ్” మోడ్ ఆన్ చేయండి

*ముఖ్యమైన యాప్స్ (కాల్స్, మెసేజెస్) మాత్రమే అనుమతించండి

*రోజుకు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే నోటిఫికేషన్లు చెక్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోండి

*ఫోన్‌ను సైలెంట్ లేదా గ్రేస్కేల్ మోడ్‌లో ఉంచడం కూడా మీ పనులకు కలిగే ఆటంకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

Next Story