- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'గురివింద' సామెతలా వ్యవహరిస్తున్నారా..?
ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రైవేట్ వ్యాపారాల ఆరోపణలపై విచారణకు ఎంఈవో హామీ.. మంత్రి జోక్యం కోరుతున్న తల్లిదండ్రులు.

దిశ, ఖమ్మం రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు ఉపాధ్యాయులు చిట్టీలు, రియల్ ఎస్టేట్, బీమా తదితర ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై 'దిశ'లో శనివారం ప్రచురితమైన "ముందు వ్యాపారం.. తర్వాతే పాఠశాల" కథనం అనంతరం విద్యాశాఖలో కదలిక కనిపించినట్లు సమాచారం. కథనం వెలువడిన తర్వాత నిఘా వర్గాలు రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంబంధిత అధికారుల స్థాయిలో సమగ్ర విచారణ జరగకపోవడంతోనే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మానికి సమీప ప్రాంతాల్లో వ్యాపారాల నిర్వహణ..?
ఖమ్మం రూరల్, ముదిగొండ, టీ.పాలెం, కూసుమంచి మండలాల్లో పనిచేస్తున్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్నారని, ఖమ్మానికి సమీపంగా ఉండటంతో అక్కడే రియల్ ఎస్టేట్, బీమా తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్ నగర్, సాయిగణేష్ నగర్, ఓరుగంటి నగర్, వరంగల్ క్రాస్ రోడ్, సాయిప్రభాత్ నగర్ తదితర ప్రాంతాల్లో నివసించే కొందరు ఉపాధ్యాయులు ప్రధానంగా రియల్ ఎస్టేట్, బీమా రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలపై ప్రశ్నలు..
ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహించడం ఉద్యోగ నియమావళికి విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మండల విద్యాధికారి (ఎంఈవో) పర్యవేక్షణ, విద్యాహక్కు చట్టం అమలు తీరుపైనా తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ విచారణలో జాప్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు భంగం కలిగించేలా ప్రైవేట్ వ్యాపారాల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలులో లోపాలున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరికొందరు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవాలని డిమాండ్...
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అవసరమైతే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మండల విద్యాధికారి (ఎంఈవో) మూడ్ శ్రీనివాస్ స్పందిస్తూ, 'దిశ'లో ప్రచురితమైన కథనంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తామని తెలిపారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నవారు నేరుగా తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని, ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారిస్తామని ఎంఈవో వెల్లడించారు.






