గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం.. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు: మంత్రి కోమటిరెడ్డి

by Taduka Kalyani |

తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేకుండా ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం.. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, పరిగి : తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేకుండా ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రూ.184.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం మంత్రులు ర్యాలీగా పరిగి పట్టణంలో పర్యటించి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించే దిశగా రెండో విడత కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధి కోసం రోడ్ల నిర్మాణానికి రూ.900 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా పరిగి నియోజకవర్గానికి రూ.184.15 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది

రవాణా వ్యవస్థ మెరుగుపడితే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెంది స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరిగి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి వివరించారు. పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసేకరణలో సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story