రోడ్ల సౌకర్యంతోనే పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధి

by Taduka Kalyani |

వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ. 900 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు.

రోడ్ల సౌకర్యంతోనే పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధి
X

దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ. 900 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో రూ. 345.88 కోట్ల వ్యయంతో 143.53 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్న 8 హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల నిర్మాణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జీపీఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గానికి రూ.345.88 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. ప్రజా పాలనలో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మున్ముందు మరిన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్‌ పాలనలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రూ. 500 సబ్సీడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని పేర్కొన్నారు. కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే 94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని హామీ ఇచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమని భావించి రూ. 900 కోట్ల వ్యయంతో జిల్లాలో ప్రధాన రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కాగ్నానదిలో మురుగునీరు కలవకుండా రూ. 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించదని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరిగిందని తెలిపారు.

ప్రత్యేక నిధులతో రోడ్లు, అభివృద్ధి పనులకు శ్రీకారం

శాసనమండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు వచ్చాయని, రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రోడ్ల అభివృద్ధితో బషీరాబాద్‌లో 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వెనుక బడిన తాండూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్ పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింలు, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ధారాసింగ్‌, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story