- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలలే ఉన్నత భవిష్యత్తుకు పునాది : ఎమ్మెల్యే
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదివి తల్లిదండ్రులు, పాఠశాల, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

దిశ, జోగులాంబ ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదివి తల్లిదండ్రులు, పాఠశాల, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద రూ.48 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి కోసం రూ.10 లక్షలతో టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివానని, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మదిలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా బోధిస్తున్నారని తెలిపారు.
గద్వాల జిల్లాలో అత్యధిక విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది నేడు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం పొందానని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ నాయకుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి దాతృత్వంతో పాఠశాలకు వాటర్ ఫిల్టర్, డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్, బండ్ల రాజశేఖర్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, సత్యారెడ్డి, రమేష్ నాయుడు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






