స్టేట్ పాలిటిక్స్‌లో సరికొత్త సెన్సేషన్.. కొత్త పార్టీపై కవిత సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-05 08:12:46  IST  )

ఉద్యమ ద్రోహులంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

స్టేట్ పాలిటిక్స్‌లో సరికొత్త సెన్సేషన్.. కొత్త పార్టీపై కవిత సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యమ ద్రోహులంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శాసన మండలిలో ప్రసంగించిన అనంతరం ఆమె గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరూ కలిసికట్టుగా పనిచేశారని, అధికారం వచ్చాక అసలైన ఉద్యమకారులను బీఆర్ఎస్ నుంచి అన్యాయంగా బయటకు పంపారని విమర్శించారు. తనపై కొందరు కక్షకట్టి కట్టడి చేశారని, రాజకీయంగా ఎదగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి అందులో రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేస్తే 1.89 లక్షల కోట్లు కేవలం నీటి పారుదల రంగానికి వినియోగించారని ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు నిరుపేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారో బీఆర్ఎస్ పెద్దలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తనను అవమానకరంగా పార్టీ నుంచి బహిష్కరించారని కవిత ఆరోపించారు.

రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోంది..

పార్టీలో ఉన్న ఎంతోమంది ఆశలు అడియాశలు అయ్యాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నేడు అన్ని బంధనాలు తెంచుకుని తాను బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఇది కేవలం తన ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం కాదని.. ప్రజా సమస్యలపైనే తన పోరాటమని అన్నారు. తనలాగే తెలంగాణ ఆడబిడ్డలకు రోషం ఎక్కువని, యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందని తెలిపారు. వామపక్ష నేతలు, మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజాస్వామ్యవాదులు తమతో పనిచేయాలనుకునే వారందరికీ ‘తెలంగాణ జాగృతి’ ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో జాగృతి కూడా పోటీలో ఉంటుందని, ప్రజల పక్షాన మళ్లీ చట్టసభల్లో అడుగుపెడతామని అన్నారు. మహిళల హక్కుల కోసం తనను ప్రజలంతా ఆశీర్వదించాలని కవిత గన్‌పార్క్ వేదికగా సంచలన ప్రకటన చేయడం ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More... kavitha: నా పిల్లల మీద ఒట్టు.. బీఆర్ఎస్‍లో జరిగింది చెప్పుకుంటూ మండలిలో ఏడ్చేసి కవిత

Next Story