kavitha: నా పిల్లల మీద ఒట్టు.. బీఆర్ఎస్‍లో జరిగింది చెప్పుకుంటూ మండలిలో ఏడ్చేసిన కవిత

by Prasad Jukanti |   (  Updated:2026-01-05 14:30:58  IST  )

ఇవాళ శాసనమండలిలో మాట్లాడిన కవిత భావోద్వేగానికి గురయ్యారు.

kavitha: నా పిల్లల మీద ఒట్టు..  బీఆర్ఎస్‍లో జరిగింది చెప్పుకుంటూ మండలిలో ఏడ్చేసిన కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ శాసనమండలిలో మాట్లాడిన ఆమె అన్ని ఆలోచించాకే తన రాజీనామా నిర్ణయం తీసుకున్నానని దయచేసి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‍ను మరోసారి కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు బీఆర్ఎస్‍లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అనేక ఆంక్షల మధ్య పని చేయాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్‍లో ప్రశ్నిస్తున్న తనను అణగదొక్కారని తన రాజకీయ ప్రస్తానాన్ని వివరిస్తూ నిండు సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఏ నాడు నాకు మద్దతుగా నిలవలేదన్నారు. బీఆర్ఎస్ వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పని చేశానన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ గండి కొట్టిందని సంచలన ఆరోపణలు చేశారు.

నన్ను కట్టడి చేశారు:

2004 లో నేను అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి నేను భారత్ కు వచ్చారు. 2006లో నేను ఉద్యమంలోకి వచ్చాను. 2013-14 లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు జరిగాయని తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని పిలిపిస్తే మేము కుటుంబ సమేతంగా 2013లో ఢిల్లీకి వెళ్లామన్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రెండు నెలలు అవుతున్నా కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవరు పలకరించిన పాపాన పోలేదు. అటువంటి సమయంలో సోనియాగాంధీకి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఆస్కార్ ఫెర్నాండేజ్ తో నాకున్న పరిచయం కొద్ది అతడికి కేసీఆర్ కు ప్రత్యేక సమావేశం పెట్టించానన్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఇన్వాల్వ్ కావడంతో తెలంగాణ సాధన ముందుకు సాగిందన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ కాంగ్రెస్‍లో విలీనంపై చర్చ జరిగినా విలీనం కాలేదన్నారు. దాంతో ఇక్కడ బీఆర్ఎస్ ఇండిపెండెంట్‍గా పోటీ చేసింది. నేను రాజకీయాల్లోకి వస్తానని మొదట్లో వస్తానని అనుకోలేదు. నేను ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్జీవో నడపాలని అనుకున్నాను. కానీ 2013-14లో నేను ఎంపీగా నిజామాబాద్ లో పోటి చేస్తే అక్కడ ఉండే మన ఎమ్మెల్యేలు అందరూ గెలిచే ఆస్కారం ఉంటుందని తనకు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. నేను ఎప్పుడు టికెట్ అడుక్కోలేదని పార్టీనే పిలిచి టికెట్ ఇచ్చిందన్నారు. ఈ నిర్ణయాన్ని నిజామాబాద్ ప్రజలు గౌరవించి 9 స్థానాలకు 9లో బీఆర్ఎస్‍ను గెలిపించారు. దాంతో బీఆర్ఎస్ ఇండిపెండెంట్ గా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. నేను లోక్ సభలో అనేక అంశాలపై పోరాడి సాధించాం. నాకు ఏ పాత్ర ఇచ్చినా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా పని చేశాను. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో వచ్చిన తొలి బతుకమ్మ వేడుకల్లోనే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. 8 ఏళ్లుగా నేను వ్యక్తిగతంగా చేస్తున్న పనులను పార్టీలో అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ నేను ఎక్కడా తెలంగాణ బిడ్డలను, రాష్ట్ర ప్రజల కోసం వచ్చినా నవ్వుతోనే పని చేశాను. నా వద్దకు ఎప్పుడు పైరవీలు, కాంట్రాక్టర్లు రాలేదు. నేను ఎప్పుడు పేద ప్రజల మధ్యలో ఉండి పని చేశాను. బీడీ కార్మికులు, ఆశావర్కర్లు, అంగన్ వాడీ టీచర్లు, ఐకేపీ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ కార్మికులు, టీచర్లు, మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు ఇలా ఎవరు వచ్చినా వారి కోసం నాతో అయినంత మేరకు పని చేశాను. ఇంత చేసినా పార్టీ మౌత్ పీసులుగా ఉన్న పార్టీ టీవీలు, పత్రికలు ఏనాడు మద్దతు ఇవ్వలేదు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. కానీ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసుకోలేకపోగా ఔట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచిపోశించారన్నారు.

ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు:

బీఆర్ఎస్ అంతర్గత వేదికలపై ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు. ప్రశ్నించినందుకే కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు కక్ష కట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబాటు చేశారని ఆరోపించారు. ధర్నా చౌక్ ఎత్తివేయడంపై ఎన్నోసార్లు అంతర్గతంగా నిరసన చెప్పాను. రైతుల అక్రమ అరెస్టులపై మాట్లాను. పార్టీ, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పడు పార్టీ దృష్టికి తీసుకుపోయాను. అమరజ్యోతి నుంచి మొదలు పెడితే అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ నిర్మాణం, కలెక్టర్ల నిర్మాణాల వరకు తీవ్ర అవినీతి జరిగిందనేది ముమ్మాటికి వాస్తవం అన్నారు. ఉద్యమకారుల పట్ల తీవ్ర నష్టం జరిగింది. వారికి వేరే రకంగా సహాయం చేయలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం చేయాలని అడిగినా అదీ చేయలేదు. 1969 ఉద్యమకారులను గుర్తించలేకపోయారు. నీళ్లు, నిధులు నియామకాలు అన్ని విషయాల్లో గండిపెట్టుకుంటూ పోయారు. కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న దురాగతాలను ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేస్తే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేరెళ్ల ఘటన బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నిర్లక్ష్యం వల్ల తీవ్ర అన్యాయం జరిగింది.

బీఆర్ఎస్ పేరు అంగీకరించలేదు:

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారుస్తామన్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించాను. పేరు మార్పును, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాను ఒప్పుకోలేదన్నారు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని అన్నారు. తెలంగాణలో ఎన్నో పనులు పెండింగ్‍లో ఉన్నాయి. ప్రాజెక్టులపై 1లక్ష 89 వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా ఇచ్చిన ఆయకట్టు 14 లక్షల ఎకరాలు మాత్రమే. ఇంత ఖర్చు పెట్టి ఓ కాంట్రాక్టర్ లబ్ధిపొందారు. బీజేపీ కూడా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. కేసీఆర్ మీద కక్షతో నన్ను జైలుకు పెట్టారు. అయినా బీఆర్ఎస్ పార్టీ ఏనాడు నాకు అండగా నిలబడలేదు. అయినా ఒక్కదాన్నే మూడేళ్లు ఈడీ, సీబీఐతో పోరాడాను. పార్టీ భావజాలంతో సరిపోకపోతే ఆనాడే బయటకు పంపించాలి. కానీ అలా చేయకుండా పార్టీలోనే కొనసాగాలి కానీ పార్టీ మీకు అండగా నిలబడదనేలా వ్యవహరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఘోష్ కమిటీ కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఆ పార్టీలో ఎవరు మాట్లాడరు. కానీ కేటీఆర్, హరీశ్ రావుపై కేసులు వస్తే అందరూ మాట్లాడారు.

బీఆర్ఎస్ రాజ్యాంగం పెద్ద జోక్:

హరీశ్ రావు ఆయన టీమ్ లో ఉన్న అవినీతి పరుల పేర్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తానన్నారు. ఈ పేర్లు చెప్పిన తెల్లారే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్. జాతీయస్థాయిలో పని చేయాలనుకున్న బీఆర్ఎస్ కు 8 పేజీల రాజ్యాంగం ఉంది. కానీ దీనికి గత కమిటీ ఎప్పుడు వేశారో తెలియదు. నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లీనరీ కమిటీ రాత్రికి రాత్రి పుట్టుకు వచ్చింది. సస్పెన్స్ విషయంలో నాకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వలేదు. ఒక పార్టీని నడిపే పద్ధతి ఇది కాదు. అవసరం అయితే పార్టీ చర్యలను నేను లీగల్‍గా చాలెంజ్ చేయవచ్చు. కానీ నేను చేయను అన్నారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నాను. పార్టీలో నా విషయంలో జరిగిన పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుని ఇది ఆస్తుల పంచాయతీ అని ప్రచారం చేస్తోందని ఇది అవాస్తవం అన్నారు. లక్ష్మినరసింహా స్వామి మీద, నా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాని ఆస్తుల పంచాయతీ కాదని ఆత్మగౌరవ పోరాటం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తితో లేదని అందువల్ల నేను ఓ వ్యక్తిగా ఈ హౌస్ నుంచి బయటకు వెళ్తున్నానని కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా ఈ చట్టసభల్లో అడుగుపెడతాని చెప్పారు. రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానన్నారు.

Read More... స్టేట్ పాలిటిక్స్‌లో సరికొత్త సెన్సేషన్.. కొత్త పార్టీపై కవిత సంచలన ప్రకటన

Next Story