Phone Tapping Case: కూపీ లాగుతున్న సిట్.. హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం

by Prasad Jukanti |   (  Updated:2026-01-20 07:18:07  IST  )

ఫోన్ ట్యాపింక్ కేసులో హరీశ్ రావు విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు హరీశ్ రావు నుంచి కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.

Phone Tapping Case: కూపీ లాగుతున్న సిట్.. హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును (Harish Rao) సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 160 సీఆర్‍పీసీ కింద నిన్న నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు ఆయన విచారణకు హాజరయ్యారు. హరీశ్ రావుతో పాటు ఆయన అడ్వకేట్ రామచందర్‌రావు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం సజ్జనార్ నేతృత్వంలోని సిట్ (SIT) అధికారుల బృందం హరీశ్‌రావును ప్రశ్నిస్తోంది. కస్టడీలో అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్లతో పాటు ఓ న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సిట్ అధికారులు హరీశ్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ పాత్ర ఏంటి? ఫోన్ ట్యాపింగ్ చేసేలా ఎవరెవరికి డైరెక్షన్స్ ఇచ్చారు?’ అనే అంశాలపై సిట్ కూపీ లాగుతున్నట్లు సమాచారం. అయితే విచారణ సందర్భంగా గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీశ్‌రావు సిట్‍కు సమర్పించారు.

మునుగోడు బైపోల్ చుట్టూ క్వశ్చన్స్..!

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2024 మార్చిలో ఎస్ఐబీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ప్రస్తుతం హరీశ్‌రావును సిట్ ప్రస్తుతం విచారిస్తోంది. ఈ కేసులో సిట్ ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ కేసులో అధికారులను ఇప్పటికే విచారించగా రాజకీయ నాయకుల పాత్ర ఏంటనేది మాత్రమే మిగిలి ఉంది. ఇందులో భాగంగా తాజాగా హరీశ్‌రావును సిట్ టీమ్ విచారిస్తోంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో శ్రవణ్‌రావుకు కొన్ని నంబర్లు ఇచ్చి ట్యాప్ చేయించారనేది ప్రధానంగా హరీశ్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రవణ్‌రావుకు డైరెక్షన్స్ ఇవ్వడం వెనుక ఉన్నదెవరు? ఈ కేసులో నిందితులైన రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావుతో హరీశ్‌రావుకు ఉన్న సంబంధాలు ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు సూత్రధారులు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసులో తొలిసారి సిట్ ఎదుట హాజరైన హరీశ్‌రావు నుంచి సిట్ అధికారులు ఎలాంటి విషయాలు రాబట్టబోతున్నారు? ఆయన్ను ఎంత సేపు విచారించబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

Read More... హరీష్ రావుకు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు

Next Story