- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావుకు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడుతోందని మాజీ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు ముఖం చూపలేక ఇలాంటి ఆరోపణలతో కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, ఇది పూర్తిగా అక్రమమైన కేసు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం తన సమయాన్ని వృధా చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపై, ప్రభుత్వ వైఫల్యాలపై తాము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
అలాగే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో హరీష్ రావుకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులు స్పష్టమైన తీర్పునిచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో వెలుగు చూసిన బొగ్గు కుంభకోణం వంటి భారీ స్కామ్‌లను హరీష్ రావు బయటపెట్టడంతో, ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని పేర్కొన్నారు. ఆ స్కామ్‌ల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మున్సిపల్ ఎన్నికల ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హరీష్ రావుపై కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. గత ఆరు నెలలుగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీష్ రావుకు రేవంత్ రెడ్డి ఇస్తున్న 'రిటర్న్ గిఫ్ట్' ఈ పోలీస్ నోటీసులేనని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కేసును ప్రభుత్వం ఒక ఆయుధంగా వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు.






