పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన విపక్షాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-19 06:04:35  IST  )

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వపక్ష సమావేశం నుంచి ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి వాకౌట్ చేసింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన విపక్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి సభ్యులు సమావేశం నుంచి మధ్యలోనే వాకౌట్ చేశారు.

ఇక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంట్‌లో ఖచ్చితంగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. అదేవిధంగా వాటితో పాటు లడఖ్‌కు స్పెషల్ స్టేటస్ కోరుతూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరసనలు, అయోధ్య రామాలయం పరిసరాల్లో కురిసిన వర్షాలకు రోడ్లు, మౌలిక వసతులు దెబ్బతినడం, విరాళాల చోరీ వంటి కీలక అంశాలను ఎజెండాగా మార్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, తాము లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించకపోవడంతో సమావేశాన్ని బహిష్కరిస్తూ ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాల నేతలంతా మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ స్థాయిలో విభేదాలు భగ్గుమనడంతో.. రాబోయే పార్లమెంట్ సభలు తీవ్ర గందరగోళం మధ్య సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story