- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళను ప్రోత్సహించడం సమాజ బాధ్యత : కేటీఆర్
ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం అని.. సమాజం, రాజకీయాలపై కార్టూన్లు చూపే ప్రభావం ఎంతో గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కళలను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం అని.. సమాజం, రాజకీయాలపై కార్టూన్లు చూపే ప్రభావం ఎంతో గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కళలను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రాజకీయ జీవితంలో ప్రతిరోజూ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య గడుపుతున్న తమకు ఇలాంటి ఆహ్లాదకరమైన సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు పాత జ్ఞాపకాలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తాయని చెప్పారు. దేశంలో ఆర్‌కే లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హాబ్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తెలుగులో శ్రీధర్, శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభ గొప్పదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని.. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు కార్టూనిస్టుగా శేఖర్ విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఉద్యమ సమయంలో ఆయన గీసిన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాయని కొనియాడారు. వచ్చే ఏడాది నుంచి శేఖర్ మెమోరియల్ అవార్డులను మరింత ఘనంగా నిర్వహించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రవీంద్రభారతిలో మరింత వైభవంగా కార్యక్రమం నిర్వహించేలా అండగా ఉంటానని తెలిపారు. కాగా.. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం.నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు.






